కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవు | Congress , tidipilaku puttagatulundavu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవు

Published Mon, Aug 22 2016 11:50 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

Congress , tidipilaku puttagatulundavu

సాక్షి, సిటీబ్యూరో: అరవై ఏళ్ల వలస పాలనలో ఎండిన పొలాలకు నీళ్లిచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేస్తున్న కాంగ్రెస్,టీడీపీ పార్టీలకు పుట్టగతులుండవని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో మంగళవారం తెలంగాణా ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఒప్పందం చారిత్రాత్మకమైనదన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ విభాగం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రతో  ఒప్పందం కుదుర్చుకొని నగరానికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈనెల 24న బేగంపేట్‌ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకు భారీ జనసమీకరణ చేయాలన్నారు. మల్లన్న ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తున్నామన్నారు. నగరంలో పార్టీ బలోపేతం చేసేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని, ప్రతి సమావేశానికి విధిగా హాజరుకావాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ..నూతన ఒప్పందంతో ఐదు జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణాలో ప్రాజెక్టులు పూర్తికాలేదన్నారు.
 
ప్రాజెక్టుల ఆవశ్యకతపై అదేరోజు విమానాశ్రయం ఆవరణలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారన్నారు. పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ప్రతినెలా తొలి ఆదివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి అందరికీ సౌలభ్యంగా ఉండేందుకు 27 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. త్వరలో ఆలయ కమిటీల్లో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామన్నారు. సమావేశంలో గ్రేటర్‌ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, ముఖ్యనేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement