సీఐడీ ఇన్‌స్పెక్టర్ పేరుతో అమ్మాయిలకు వల
ఉప్పల్: సీఐడీ ఇన్‌స్పెక్టర్‌నంటూ ఐడీ కార్డులను సృష్టించుకుని.. అమ్మాయిలను వలలో వేసుకొని మోసం చేస్తున్న ఓ టీపీఎస్‌పీ కానిస్టేబుల్‌ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఉప్పల్ ఠాణాలో మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి, ఉప్పల్ సీఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వాడాలి శ్రీరంగరాజు(32) యూసుఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్ కానిస్టేబుల్. ఉప్పల్ చిలుకానగర్‌లో భార్య లతతో కలిసి ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు.
కానిస్టేబుల్ శ్రీరంగరాజు ప్రతీ రోజు విధులు ముగించుకున్న తర్వాత మూడుస్టార్ల చొక్కా ధరించి సీఐడీ ఇన్‌స్పెక్టర్ అవతారం మెత్తుతాడు. స్కార్పియో కారు, బుల్లెట్‌పై తిరుగుతూ ఖరీదైన ల్యాప్‌టాప్‌లను వాడుతూ అమ్మాయిలకు వల వేస్తాడు. సీఐడీ ఇన్‌స్పెక్టర్‌నంటూ నకిలీ ఐడీ కార్డులు చూపిస్తాడు. తనుకు పెళ్లైన వెంటనే విడాకులు తీసుకున్నానని నమ్మబలికి ఎంతో మంది మహిళలను మోసం చేశాడు. ఇదే విధంగా రామంతాపూర్‌లో తన సోదరి ఇంటి పక్కన ఉండే ఓ మహిళను నమ్మించి మోసం చేశాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాన్ని కూడా చెడగొట్టాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో శ్రీరంగరాజు ఉదంతం బయటపడింది. అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని మరికొందరి వద్ద పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని మోసం చేశాడని పోలీసులు తెలిపారు. 2009-2011లో ఎస్‌ఐ పరీక్షలు రాసి ఫెయిల్ కావడంతో శ్రీరంగరాజు నకిలీ సీఐ అవతారమెత్తినట్లు తెలిపారు. 2014లో స్కూల్ టీచర్‌గా పని చేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పరచుకుని ఆమె వద్ద నుంచి రూ.2 లక్షలు తీసుకుని స్కార్పియో కొన్నాడు. ఇదే కారులో ఇన్‌స్పెక్టర్ డ్రెస్స్ వేసుకుని తిరిగే వాడని పోలీ సులు తెలిపారు. గురువారం నిందితున్ని రిమాండ్‌కు తరలించారు.