భక్తులను కాపాడబోయి మృత్యుఒడికి...
విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి
శివవరాత్రి పర్వదినాన అపశ్రుతి
బహదూర్‌ఫురా: శివరాత్రి పర్వదినం సందర్భంగా గుడి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. భక్తులను విద్యుత్ వైర్లు ఉన్న వైపు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్న క్రమంలోనే అతడు షాక్‌కు గురయ్యాడు. ఈ విషాద ఘటన బహదూర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పో లీసుల కథనం ప్రకారం... మహాశివరాత్రి సందర్భంగా కిషన్‌బాగ్‌లోని కాశిబుగ్గ గుడి వద్ద సోమవారం బహదూర్‌పురా పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ (25) బందోబస్తులో ఉన్నాడు. వందలాదిగా తరలివస్తున్న భక్తులను అతను అదుపు చేస్తున్నాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కొందరు భక్తులు మధ్యాహ్నం ఒంటి గంటకు గర్భగుడి పక్కనున్న మరో దారిలో బయటికి వెళ్లేందుకు యత్నించగా అడ్డుకొని పక్కకు పంపించాడు.
ఇదే క్రమంలో శ్రీనివాస్ నాయక్ కాలు జారి విద్యుత్ వైర్లపై పడ్డాడు. షాక్‌కు గురై పక్కనే ఉన్న నీటి సంపులో పడిపోయాడు. తోటి కానిస్టేబుళ్లు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి శ్రీనివాస్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందా డు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీనివాస్ నాయక్ మృతదేహాన్ని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సందర్శించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శ్రీనివాస్‌నాయక్ మృతి వార్త తెలిసి అతడు నివాసముండే ఆర్‌ఎన్ కాలనీకి బంధువులు,స్నేహితులు పెద్ద ఎత్తున చేరుకొని విలపించారు.