=నీటి సరఫరాపై అందుతున్న ఫిర్యాదులపై మౌనం
=ఆదాయం పెంపుపైనే జలమండలి దృష్టి
=ఇప్పటికే ఐదు వేల నోటీసుల జారీ
=మరో వారంలో బకాయిదారులందరికీ తాఖీదులు
సాక్షి, సిటీబ్యూరో: అరకొర మంచినీటి సరఫరా.. అస్తవ్యస్త పైప్‌లైన్లు.. ఎక్కడికక్కడే లీకేజీలు.. సరఫరా నష్టాలు.. వెరసి జలమండలి తీరుతో ‘గ్రేటర్’ వినియోగదారుల కష్టాలు వర్ణనాతీతం. ఇవేం పట్టని జలమండలి ఆదాయం పెంచుకోవడం కోసం మాత్రం తెగ తాపత్రయ పడుతోంది. గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల్లో ఇప్పటికీ సుమారు ఐదు వందల కాలనీలకు వారం పదిరోజులకోమారే మంచినీటి సరఫరా జరుగుతున్నా పట్టని జలమండలి..
వినియోగదారులపై రెడ్‌నోటీసుల కొరడా ఝళిపిస్తోంది. రెండు నెలలుగా నీటిబిల్లు బకాయిపడిన వారికి రెడ్‌నోటీసులిచ్చి వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. జలమండలి పరిధిలోని 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో ఇప్పటివరకు ఐదువేల రెడ్‌నోటీసులిచ్చిన బోర్డు.. మరో వారంలో బకాయిదారులందరికీ నోటీసులివ్వాలని సంకల్పించినట్లు సమాచారం. కనీసం రెండు రోజులకోమారైనా మంచినీటిని సరఫరా చేయాలని కోరుతూ వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకుండా కేవలం రెవెన్యూ ఆదాయంపైనే దృష్టిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదాయ జపం
జలమండలి ఇపుడు ఆదాయమంత్రం జపిస్తోంది. ఇటీవల వాణిజ్య, పరిశ్రమలకున్న కనెక్షన్లకు రెట్టింపు స్థాయిలో బిల్లులు వడ్డించి ఏటా రూ.324 కోట్లు సొమ్ము చేసుకోవాలని లక్ష్యం పెట్టుకున్న బోర్డు.. ఇపుడు గృహవినియోగదారులపై పడింది. నీటిబిల్లు బకాయి పడితే చాలు వారికి రెడ్ నోటీసులు ఇస్తామంటూ హడావుడి చేస్తోంది. అప్పటికీ దిగిరాకుంటే కుళాయి కనెక్షన్ తొలగించడంతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి చరాస్తులు జప్తు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తామని కలకలం సృష్టిస్తోంది.
గత పక్షం రోజులుగా డివిజన్ల వారీగా బోర్డు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా రెవెన్యూ సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ మేరకు సిబ్బందికి దిశానిర్దేశం కూడా చేశారు. కాగా జలమండలికి ప్రతినెలా నీటిబిల్లుల ద్వారా రూ.56 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. దీన్ని మరో పదికోట్లకు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు బోర్డు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే పలు ప్రభుత్వ కార్యాలయాలు, మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలకున్న బకాయిలపై దృష్టిపెట్టని జలమండలి కేవలం గృహవినియోగదారులను లక్ష్యం చేసుకోవడంపైనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బోర్డుకు సుదీర్ఘకాలంగా లక్ష రూపాయలకు పైగా నీటిబిల్లు బకాయిపడిన 575 మొండి బకాయిదారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగి చూస్తుండడం గమనార్హం.
సరఫరాపై మౌనం..
అరకొర నీటిసరఫరా, వేళాపాళా లేకుండా వస్తున్న నీళ్లతో పలు శివారు ప్రాంతాలు విలవిల్లాడుతున్నా జలమండలికి పట్టడం లేదు. కుత్బుల్లాపూర్, కాప్రా, మల్కాజ్‌గిరి, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరువు, ఉప్పల్, బాలానగర్‌ల పరిధిలోని సుమారు 500 కాలనీలకు ఇప్పటికీ వారం, పదిరోజులకోమారు మాత్రమే కుళాయిలు పనిచేస్తున్నాయి. అదీ పట్టుమని పది బిందెలు నిండకుండానే నల్లాలు ఆగిపోతున్నాయి. ఈ సమస్యలపై ప్రతివారం డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వందలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు.
వినియోగదారులపై ‘రెడ్ నోటీసుల’ కొరడా
Published Tue, Dec 10 2013 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement