రైతుల ఆత్మహత్యలు కొనసాగాలా?
► ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు: హరీశ్‌రావు
► ప్రజాభిప్రాయ సేకరణకు ఆటంకం కలిగిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగాలని కాంగ్రెస్ నాయ కులు కోరుకుంటున్నారా? రైతుల ఆత్మహ త్యలకు అడ్డుకట్ట వేసేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను చేపడుతుంటే.. ఆ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు.. ట్రిబ్యునళ్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆటంకం కలిగిస్తు న్నారు. ఇటు ప్రజాభిప్రాయ సేకరణను విచ్చిన్నం చేసే చర్యలకు పాల్పడుతున్నారు..’’ అని సాగునీటిశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కాంగ్రెస్ మాజీ మంత్రి శ్రీధర్‌బాబు పెద్దపల్లిలో చేసిన దాదాగిరీని, రౌడీయిజాన్ని.. ఆ పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ సమర్థించడం విడ్డూరమని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు 11 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ సజావుగా ముగిసిందని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాజె క్టుకు అనుకూలంగా ఉన్నట్టు ప్రజలు స్పష్టం చేశారని, వేగంగా పూర్తి చేయాలని కూడా కోరారని వివరించారు. ప్రజలు, రైతులు, రాజకీయ పక్షాల ప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే వాతావరణాన్ని కల్పించినా.. కాంగ్రెస్ పార్టీ చౌకబారు ప్రచారం కోసం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
అడ్డుకోవడానికి కుట్రలు
ప్రాజెక్టులను అడ్డుకోవడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజాభి ప్రాయ సేకరణ ప్రక్రియ ఇష్టం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్దపల్లిలో ప్రజాభి ప్రాయ సేకరణను భగ్నం చేయడానికి శ్రీధర్‌బాబు ప్రయత్నించారన్నారు. అందువల్లే పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ వేదికను రాజకీయం చేయడానికి ప్రయత్నిం చారని విమర్శించారు.
అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారని.. మెదక్‌లో కాంగ్రెస్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా మాట్లాడారన్నారు. మరోవైపు నిబంధన లకు విరుద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందంటూ కేంద్రానికి కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఫిర్యాదు చెయ్యడం కూడా కుట్రలో భాగమేనన్నారు. ఇలా ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని తెలంగాణవాదులు, ప్రజలు, రైతులకు పిలుపునిచ్చారు.
ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు..
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోందని... ఆ చిట్టా విప్పితే ఆశ్చర్యం కలుగుతుందని హరీశ్ పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రక్రియను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిందని.. తమ్మిడిహెట్టి నుంచే నీటిని తరలించాలంటూ మొండి వాదన చేసిందని, మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోలేదని వివరించారు. మహారాష్ట్రతో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ప్రాజెక్టుల నిర్మాణానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని స్వాగతించలేక అక్కసుతో విమర్శలు చేసిందని మండిపడ్డారు.
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో టెంట్లు వేసి, కార్యకర్తలను బయటి నుంచి తరలించి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్లు వేసి జీవో 123 అమలుపై స్టే తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల్లో భూసేకరణ మందగించి పనులు జాప్యమయ్యాయన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే 30కి పైగా పిటిషన్లు వేశారని, పాలమూరు, డిండి ప్రాజెక్టులపైనా కేసులు వేశారని పేర్కొన్నారు. చివరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ప్రాజెక్టులకు అడ్డుపడ్డారని హరీశ్ మండిపడ్డారు.