
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తు ఓటర్లపైనే ఉంటుందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ఓటర్లంతా బాధ్యతతో తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నరసింహన్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడే ఓటు హక్కును పరిశీలించుకోవడం, కొత్తగా ఓటరు నమోదుకు శ్రీకారం చుట్టడం సరికాదన్నారు. అర్హులంతా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ఉత్తమ ప్రభుత్వం తయారవుతుందని, ఫలితంగా ప్రపంచంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మారుతుందన్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న వారికే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. ఎలక్షన్ రోజు సెలవు సందర్భంగా టీవీల ముందు కూర్చోకుండా ఓటు హక్కుపై మిగతావారికి అవగాహన కల్పించాలని, వారితో ఓటు వేయించాలని సూచించారు. దేశంలోని ఓటర్లలో 40 శాతానికిపైగా యువకులే ఉన్నార న్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని దీనికి ప్రధాన కారణం నగర ఓటర్లలో నిర్లిప్తతే అన్నారు.
ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ రాజసదారాం అన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణను సమర్థవంతంగా, ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేశామన్నారు. ఓటర్ల జాబితా సవరణలో మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించామన్నారు. వివిధ సమస్యలు ఉన్నప్పటికీ ఓటర్ల జాబితా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించారని ముఖ్య ఎన్నికల అధికారి అనూప్‌సింగ్ ప్రశంసించారు.
పలువురికి ప్రత్యేక పురస్కారాలు..
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు తదితర సేవలను సమర్థవంతంగా అందించినందుకుగాను ఉత్త మ జిల్లా ఎన్నికల అధికారులుగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆసిఫాబాద్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి తదితరులకు గవర్నర్ ప్రత్యేక పురస్కారాలు అందజేశారు.
అదేవిధంగా ఉత్తమ రిజిస్ట్రేషన్ అధికారులుగా జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ డి.జయరాజ్ కెనడి, నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి, ఖమ్మం ఆర్డీవో పూర్ణచందర్‌రావు, వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్, కరీంనగర్ ఆర్డీవో రాజుగౌడ్‌లతో పాటు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సామ్రాట్ అశోక్, ఏఎంసీ జయంత్, జయప్రకాష్‌లకు కూడా ప్రత్యేక అవార్డులను అందజేశారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment