![క్రైం సీరియల్ చూసి.. దారుణం! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41493966964_625x300.jpg.webp?itok=W9rPoB7q)
క్రైం సీరియల్ చూసి.. దారుణం!
టీవీలలో వచ్చే క్రైం సీరియళ్లు యువత మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. తమ పక్కింట్లో ఉండే బాలుడిని నమాజ్‌కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి అతడిని హతమార్చాడు. దాదాపు రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటనలో ఆధారాలు తాజాగా బయటపడ్డాయి. చాంద్రాయణగుట్టకు చెందిన ఉరూజుద్దీన్ అనే బాలుడు ఏప్రిల్ 22వ తేదీ ఉదయం ఇంట్లోంచి వెళ్లి, రాత్రయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా విచారించినప్పుడు చివరిసారిగా తాము పక్కింట్లో ఉండే మునీర్‌తో అతడిని చూశామని చెప్పారు. దాంతో అతడిని అదుపులోకి తీసుకోగా.. అతడి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయని, అలాంటప్పుడు తమవాడి మీద ఎందుకు అనుమానించి తమను వేధిస్తారని తిరగబడ్డారు. దాంతో పోలీసులు కాస్త నెమ్మదించారు.
కానీ ఈలోపు మునీర్ ముంబై పారిపోయేందుకు ప్రయత్నించగా, అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో మళ్లీ విచారించారు. దాంతో అసలు విషయం తెలిసింది. ఆరోజు నమాజ్‌కు వెళ్తున్న ఉరూజుద్దీన్‌ను తానే కిడ్నాప్ చేశానని, అయితే కిడ్నాప్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక గొంతు నులిమి చంపేశానని అంగీకరించాడు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించినా వెంటపడి మరీ తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఓ మురికి కాల్వలో పడేసినట్లు చెప్పాడు. సీసీటీవీ ఫుటేజిలో కూడా ఉరూజుద్దీన్‌ను మునీరే తీసుకెళ్లినట్లు స్పష్టంగా రికార్డయింది. దాంతో పోలీసులు మునీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను క్రైం సీరియళ్లు ఎక్కువగా చూస్తానని, అందుకే ఈ ఆలోచన వచ్చిందని పోలీసులకు మునీర్ చెప్పాడు.