
భూదాన్ భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు
⇒ రాష్ట్ర భూదాన్ బోర్డు కార్యదర్శి కె.కృష్ణారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో భూదాన్ యజ్ఞ బోర్డు భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శి కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో భూదాన్ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయంలో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు అధికారుల సంతకాలతో కొందరు నకిలీ పత్రాలు సృష్టించి.. భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్నారు.
హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ మండలం కుంట్లూరు పాపాయిగూడెం సర్వే నంబర్ 215 నుంచి 224 వరకు 100 ఎకరాల్లో ప్లాట్స్ వేశారని.. వారికి నకిలీ పత్రాలు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇక షేక్‌పేట మండలంలోని 591/13 సర్వే నంబర్‌లో 52 ఎకరాలను గతంలో ఉమ్మడి రాష్ట్ర భూదాన్ బోర్డు లీజుకు ఇచ్చిందని.. కానీ ఆ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నందున బాధ్యులపై కేసు పెట్టాలని ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్ర భూదాన్ బోర్డు పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉందని.. అందులో ఉమ్మడి రాష్ట్రబోర్డు 47 వేల ఎకరాలను లీజుకు ఇచ్చిందని చెప్పారు. మిగతా భూమి రికార్డులపై తహసీల్దార్లు సర్వే నిర్వహిస్తున్నారన్నారు. ఇంతవరకు బోర్డు ఎవరికీ భూములు కేటాయించలేదని.. ప్రజలెవరూ మోసపోవద్దని కృష్ణారెడ్డి సూచించారు.