నగరంలోని సైదాబాద్ కాలనీ జయనగర్‌కు చెందిన నవీద్ ఈ నెల ఐదవ తేదీన గ్యాస్ రీఫిల్లింగ్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. పక్షం రోజులు దాటినా సిలిండర్ ఇంటికి డెలివరీ కాలేదు. రెండు మూడు సార్లు సంబంధిత ఏజెన్సీకి తిరిగి గగ్గొలు పెడితే కానీ బిల్లింగ్ జనరేటై ఇంటికి సిలిండర్ చేరలేదు.. ఇది ఒక్క నవీద్ సమస్యే కాదు... బుక్ చేసిన సిలిండర్ సకాలంలో ఇంటికి రాక లక్షలాది మంది నానా అవస్థలు పడుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ‘గ్రేటర్’ వంటింట్లో సంక్షోభం తలెత్తుతోంది. గ్యాస్ సమస్యలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వంట గ్యాస్ రీఫిల్లింగ్ ‘భారం’గా మారడంతో పాటు సిలిండర్ సరఫరా ఆలస్యమవుతోంది. ఆన్‌లైన్‌లో గ్యాస్ బుక్ చేసి పక్షం రోజులు దాటుతున్నా.. సిలిండర్ మాత్రం అందడం లేదు. ఎల్పీజీ డీబీటీ (ప్రత్యక్ష ప్రయోజన బదిలీ) పథకంలో అస్పష్టతతోపాటు ఆన్‌లైన్ మొరాయింపే ఈ సమస్యలకు కారణాలు. ఫలితంగా ఈ నెలలో గ్యాస్ సిలిండర్ల సరఫరా గందరగోళంగా తయారైంది. మరోవైపు చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ కోటా కూడా తగ్గింది. దీంతో సింగిల్ సిలిండర్ వినియోగదారుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ మొరాయింపు ఇబ్బందులకు గురిచేస్తుండగా తాజాగా ఎల్పీజీ డీలర్ల సమ్మె పిలుపు మరింత బెంబేలెత్తిస్తోంది.
మరోవైపు ఎల్పీజీని ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నా.. లేకున్నా గ్యాస్ రీఫిల్లింగ్ ధర మాత్రం తలకు మించిన భారంగా తయారైంది. సబ్సిడీ నగదు బ్యాంక్‌లో పడినా, పడకున్నా వినియోగదారులు రూ.1024.50 చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మొత్తం భారం భరించలేక ఇంటికి వచ్చిన సిలిండర్లను పలువురు వెనక్కి పంపిస్తున్నారు. ఫలితంగా బిల్లు రద్దు కావడంతో తిరిగి ఆన్‌లైన్‌లో గ్యాస్‌బుకింగ్ తప్పడం లేదు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరాల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోయినా చీటికీ మాటికీ ఆన్‌లైన్ మొరాయింపు, డబుల్ బుకింగ్ బిల్లింగ్ జనరేట్ అవడంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
పెండింగ్‌లో... గ్రేటర్‌లో పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం వినియోగంలో 25.38 లక్షలకు పైగా ఎల్పీజీ విని యోగదారులు ఉన్నారు. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీల కు చెందిన 135 డీలర్ల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. ప్రతి ఆయిల్ కంపెనీకి ఆన్‌లైన్ ద్వారా రోజుకు సగటున 50 వేల వరకు రీఫిల్లింగ్ కోసం కాల్స్ బుక్ అవుతుంటాయి. ఇందులో ప్రతినిత్యం 70 నుంచి 80 శాతం వరకు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ధరాభారం కారణంగా 20 నుంచి 30 శాతం పైగా సిలిండర్లు వెనక్కి రావడంతో జనరేట్ అయి న బిల్లింగ్ రద్దవుతున్నాయి. తిరిగి ఆన్‌లైన్‌లో బుకింగ్ కారణంగా ఆయిల్ కంపెనీల వద్ద కాల్స్ జాబితా పెరిగిపోతోంది. ఫలితంగా తాజా పరిస్థితి ప్రకారం సుమారు నాలుగు లక్షల కాల్స్ పెండింగులో ఉన్నాయి.
కిరోసిన్ ధరలు భగ్గు
సరఫరా తగినంత లేక సింగిల్ సిలిండర్లు ఉన్న వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. గ్యాస్ లేక జనం కిరోసిన్ కోసం వెంపర్లాడుతున్నారు. పైగా ప్రభుత్వం తెల్లకార్డులపై పేదలకు సరఫరా చేసే కిరోసిన్‌ను 4 లీటర్ల నుంచి లీటర్‌కు తగ్గించింది. దాంతో వాటి ధరలు కొద్ది రోజులుగా డీజిల్‌తో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా పాత నగరంలో కిరోసిన్ లీటర్ రూ. 45-55 మధ్య పలుకుతోంది.
సిలిండర్ సరఫరాకు 10 రోజులు
సిలిండర్ బుక్ చేసిన 10 రోజులకు వస్తుంది. దీంతో కిరోసిన్‌పై ఆధారపడాల్సి వస్తుంది. బుక్ చేసిన 3 రోజులకే సిలిండర్ సరఫరా అని ప్రకటనలు చేస్తున్నా అమలు కావటం లేదు. దీని అసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నారు.
- సంపత్, విద్యార్థి
మెసేజ్‌లే వస్తున్నాయి... గ్యాస్ బుక్ చేసిన వారం రోజుల తరువాత సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయే తప్ప సిలిండర్ మాత్రం రావడం లేదు. ఒక్కోసారి సిలిండర్ ఫలానా సమయంలో డెలివరి చేస్తున్నట్లు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆ రోజంతా ఎదురు చూసినా సిలిండర్ రావడం లేదు.
- మల్లేష్, బౌద్దనగర్
30 శాతం సిలిండర్లు వెనక్కి వస్తున్నాయి
గ్యాస్ కొరత లేదు. కానీ ఈ నెలలో 30 శాతం వరకు సిలిండర్లు వెనక్కి వచ్చాయి. వినియోగదారులు రూ. 1024.50 చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయడానికి భయపడి వెనక్కి పంపిస్తున్నారు. వారి బిల్లు రద్దయినా తర్వాత మళ్లీ బుక్ చేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ బుకింగ్‌పై ప్రభావం పడి సరఫరా అలస్యం అవుతోంది.
- అశోక్, అధ్యక్షుడు, వంటగ్యాస్ డీలర్ల సంఘం, గ్రేటర్ హైదరాబాద్
సబ్సిడీ డబ్బు జమ కావటం లేదు
ఒక్క సిలిండర్‌కు రూ. 1040 చెల్లించినప్పటికి రెండు నెలలు గడుస్తున్నా సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కావడం లేదు. ఏజెన్సీ వారిని సంప్రదిస్తే సంబంధం లేదని బదులిస్తున్నారు. సరఫరాలో జాప్యం చేస్తూ బుకింగ్ లేని వారికి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు.
- శంకర్, ప్రైవేటు ఉద్యోగి
వంటింట్లో సంక్షోభం..! పక్షం రోజులైనా అందని సిలిండర్
Published Sun, Sep 29 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement