
స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠా గుట్టును గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం... ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) అలియాస్ అలీసాబేగం కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నివాసముంటుంది. కొండాపూర్ శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ను అద్దెకు తీసుకుంది. గత నాలుగు నెలలుగా ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తోంది.
సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం రాత్రి ప్లాట్‌పై దాడి చేశారు. ప్రధాన నిందితురాలు సిమ్రాన్‌తో పాటు డీల్లీకి చెందిన డింపుల్(27), అబ్దుల్ సమద్(42), కరీంనగర్‌కు చెందిన షేక్ యాసిన్(20), షేక్ మోసిన్(20), డ్రైవర్లుగా పనిచేసే ఎండి.షకీల్(23), అబ్దుల్ అజీజ్(23), వైజాగ్ తాళ్లపాలెంకు చెందిన వంట మనిషి సంధ్య(35)లను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.
నిందితుల నుంచి అసెంట్, ఇండికా కార్లు, 20 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, ల్యాప్ టాప్, బ్యాంక్ పాస్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో రూ.2.50 లక్షలు ఉన్నాయని సీఐ తెలిపారు. బ్యాంక్‌లోని డబ్బును కోర్టుకు అందజేస్తామన్నారు. ఫ్లాట్ యజమానికి నోటీస్ జారీ చేస్తామని చెప్పారు. అతని వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఫ్లాట్ సీజ్ చేస్తామని సీఐ రమేశ్ కుమార్ తెలిపారు.