పోట్లాడుకుంటూ జీతాలు ఎగేస్తారా?
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన హైకోర్టు
వెంటనే డెయిరీ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆదేశం
హైదరాబాద్: పరస్పరం పోట్లాడుకుంటూ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సబబని ఉభయరాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరికైతే జీతాలు చెల్లించట్లేదో వారికి వెంటనే చెల్లించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాల్నీ ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వాటిని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆస్తుల్ని తమ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థకు బదిలీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం మే 6న ఉత్తర్వులు జారీచేసింది. వీటిని సవాలుచేస్తూ ఏపీ సర్కార్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇదేసమయంలో తమకు జీతాలు చెల్లించట్లేదంటూ పలువురు ఉద్యోగులూ కోర్టునాశ్రయించారు. ఈ వ్యాజ్యాల్ని జస్టిస్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మీరు పరస్పరం పోట్లాడుకుంటూ జీతాలమీద బతికే ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని పేర్కొంది.