
ప్రపంచానికి భారతే మార్గదర్శి
భారతీయ తత్వమే శాంతికి దోవ: దలైలామా
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రపంచంలోని అన్ని మతాలవారు భారత్‌లో జీవిస్తున్నారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలతో అడపాదడపా చికాకులు ఉంటున్నా పరమత సహనంతో సహజీవనం చేస్తున్నారు. ముంబైలో పార్సీలు లక్షమందే ఉన్నా వారిలో ఎన్నడూ అభద్రతా భావం కనిపించదు. ఇలా అల్పసంఖ్యాకులూ సంతోషంగా ఉండగలుగుతుండటమే ఈ దేశ ప్రత్యేకత. సనాతన భారతీయతత్వమే దీనికి కారణం’’ అని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. భారత్‌లో మాదిరి సంఘటిత, సహజీవన సౌందర్యం ప్రపంచం లో మరెక్కడా కనిపించదని పేర్కొన్నారు. అశాంతితో రగిలిపోతున్న ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది భారతీయ తత్వమేనని, అదే శాంతికి తోవ చూపుతుందని సూచిం చారు. ఈ విషయంలో భారత్ కూడా ప్రధాన భూమిక పోషించాలని ఆకాంక్షించారు. ‘‘ఇస్లాం మతంలో భాగమైనా షియా, సున్నీ లు పరస్పరం మారణకాండకు దిగుతున్నారు.
కానీ ప్రపంచంలోనే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో మాత్రం ఆ భావన లేకపోవటం గొప్ప విషయం. పరమత సహనంతో పరిఢవిల్లుతున్న ఈ దేశ గొప్పతనాన్ని ప్రపంచం అనుసరిస్తే శాంతికాముకంగా వర్ధిల్లుతుంది’’ అని పేర్కొ న్నారు. తాను భారత్‌ను దైవభూమిగా కంటే మానవీయ విలువలున్న నేలగా భావిస్తాన న్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మాదా పూర్‌లో దక్షిణాసియాకు హబ్‌గా ఏర్పాటు కానున్న దలైలామా నైతిక విలువల కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన సభలో నీతి, విలువలు, నడవడిక అన్న అంశాలపై ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
పాశ్చాత్య భావజాలం ప్రమాదకరం
నైతిక విలువలు, అహింస, కరుణ, భిన్నత్వం లో ఏకత్వం వంటి ఉన్నత విలువలతో ప్రపంచానికి మార్గదర్శనం చేసిన భారత్‌లో ప్రస్తుతం కొంతమార్పు కనిపిస్తోందని దలై లామా ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక భారత యువతలో పాశ్చాత్యీకరణ మోజు కనిపిస్తోందని, ఇది తీవ్రరూపం దాల్చేలోపు ఓసారి సనాత భారతీయ ఔన్నత్యాన్ని మన నం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో ప్రగతివైపు సాగుతూనే ఉన్నత విలువలతో కూడిన సనాతన సంప్రదాయాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. అలాంటి సనాతన విలువలను ప్రోదికొల్పేందుకే నైతిక విలువల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
చాలా మంది రాజకీయ నేతలకంటే తనకే భారతీయ సనాతన సంప్రదాయాలపై అవగాహన ఉందని వ్యాఖ్యానించారు. ‘‘నేను కొంతకాలంగా శాస్త్రవేత్తలతో మమేకమవుతూ అటు సనాతన పద్ధతులు, ఇటు ఆధునిక అడుగుల మధ్య సమన్వయం కోసం యత్నిస్తున్నా. నాగార్జును డి విధానాలు, క్వాంటమ్ ఫిజిక్స్ థియరీ దగ్గరగా ఉన్న విషయాన్ని గుర్తించాను. ఈ మేళవింపుతో ఆధునిక సమాజం ముందుకు సాగినప్పుడు యుద్ధాలకు అవకాశమే లేదు. ఆయుధ సంపత్తిపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉండదు’’ అని అన్నారు.
నాన్న కోపిష్టి.. అమ్మ కరుణామూర్తి
పిల్లలను గొప్పవారిగా తీర్చిదిద్దటంలో తల్లి దండ్రుల పాత్ర ఎనలేనిదని, ఇందులో తల్లి పాత్ర అత్యంత ముఖ్యమైందని దలైలామా చెప్పారు. పురుషులతో పోలిస్తే ఆడవారిలో కరుణ, అహింస, నైతికత పాళ్లు ఎక్కువగా ఉంటాయన్నారు. ‘‘మా నాన్న చాలా కోపిష్టి.. మా అమ్మ కరుణామూర్తి.. అందుకే నేను నాన్న పోలికలు రావద్దని కోరుకున్నా.. చిన్న ప్పుడు బద్ధకంగా ఉండే నేను తల్లి వల్లే మారిపోయా’’ అని చెప్పారు.
మీకు ఇంతటి చురుకుదనం ఎలా: కేటీఆర్
ప్రసంగం తర్వాత ప్రశ్నలు అడిగేందుకు దలైలామా అవకాశం ఇవ్వగా.. ‘‘82 ఏళ్ల వయసులో 22 ఏళ్ల కుర్రాడిలా ఎలా ఉంటున్నారు’’ అని మంత్రి కేటీఆర్ అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ... ‘‘22 ఏళ్ల యువకుడిలా ఉన్నాననటం అతిశయోక్తి. కానీ 60 ఏళ్ల వ్యక్తిలా మాత్రం కనిపిస్తా. దానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవటమే కారణం. ఎవరికీ హాని చేయలేదనే భావన మనలో ఉండాలి. అది నేర్పింది నాకు భారతీయ తత్వమే. రోజుకు తొమ్మిది గంటల నిద్ర, ఐదు గంటల ధ్యానం చేస్తాను’’ అని చెప్పారు. టిబెటెన్ అయి కూడా తనను తాను భారతీయ పుత్రిడిగానే అభివర్ణించుకుంటానని పేర్కొన్నారు. విపశ్యన ధ్యాన పద్ధతిని అలవర్చుకోవాలని సూచించారు. ఇతరులకు సాయం చేయటం, ఎవరికీ హానీ చేయని మంచితనం, సంతృప్తికర జీవనం గడిపితే మరణం కూడా గొప్పగా ఉంటుందన్నారు.
చర్చల శతాబ్ది కావాలి..
పేరు, ఊరు, రంగు, భాష, ప్రాంతం, దేశం, మతం.. ఇలా వేర్వేరు అయినా మనుషులంతా ఒక్కటేనన్న భావన ప్రజ ల్లో కలగాలని దలైలామా అన్నా రు. ఈ ప్రాథమిక అంశాన్ని వదిలేసి వేర్వేరు అన్న భావనకు ప్రాధాన్యం ఇచ్చి కలహిం చుకుంటున్నారని అన్నారు. ప్రతి సమ స్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొ నాలని సూచించారు. ఇది ‘చర్చల శతా బ్దంగా, శాంతియుత శతాబ్దంగా మిగిలి పోవాలని పేర్కొన్నారు. ఒకప్పుడు జర్మన్ కంటికి ఫ్రెంచివాళ్లు శత్రువుగా, ఫ్రెంచ్ కంటికి జర్మన్‌లు శత్రువులుగా కనిపిం చేవారన్నారు. కానీ నేటి యువత దాన్ని మార్చి స్నేహపూర్వక పొరుగు దేశస్తులుగా మారిపోయారన్నారు. అందుకే ఇప్పుడు యురోపియన్ యూనియన్ బలంగా మారిందని, ప్రపంచమంతా ఓ సమూహంగా మారాలని అన్నారు.