పేరు ఘనం.. ‘గుర్తింపు’ శూన్యం | Damaged teaching in Leading universities | Sakshi
Sakshi News home page

పేరు ఘనం.. ‘గుర్తింపు’ శూన్యం

Published Wed, Jan 27 2016 4:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

పేరు ఘనం.. ‘గుర్తింపు’ శూన్యం

పేరు ఘనం.. ‘గుర్తింపు’ శూన్యం

♦ నాక్ గుర్తింపునకు నోచుకోని ప్రముఖ వర్సిటీలు
♦ ప్రమాణాల్లేక వెనుకబడిన ఉస్మానియా, కాకతీయ
♦ రాష్ట్రంలోని ఇతర వర్సిటీలదీ అదే దారి
♦ నియామకాల్లేక దెబ్బతింటున్న బోధన
♦ గుర్తింపు లేని వాటికి కేంద్ర నిధులు కష్టమే
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకే ఒక్క విశ్వవిద్యాలయం మినహా మరే యూనివర్సిటీ కూడా నేషనల్ అసెస్‌మెంట్, అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపు పొందలేకపోయింది. నాణ్యతా ప్రమాణాల్లేక ఉస్మానియా, కాకతీయ వ ంటి ప్రముఖ వర్సిటీలూ నాక్ గుర్తింపునకు నోచుకోలేకపోయాయి. మిగతా వర్సిటీల్లో 50 శాతం నుంచి 90 శాతం వరకు అధ్యాపకుల కొరత కారణంగా నాక్ గుర్తింపు పొందలేదు. ఈనెల 19న నాక్ స్టాండింగ్ కమిటీ గుర్తింపు ఇచ్చేందుకు సిఫారసు చేసిన విద్యా సంస్థల జాబితాను విడుదల చేయగా, అందులో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ వర్సిటీ, బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్లగొండ జిల్లా భువనగిరి, ఆదిలాబాద్-మహిళా డిగ్రీ కాలేజీ, ఖమ్మంలోని మమత డెంటల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి. నాక్ గుర్తింపు ఉంటేనే నిధులిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర వర్సిటీలకు కేంద్ర నిధులు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.

 నియామకాల్లేక...
 రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్లు లేక ఇన్‌చార్జిలు సరిగా పట్టించుకోక యూనివర్సిటీలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. వీటికి తోడు అధ్యాపకులు లేక బోధన కుంటుపడింది. అధ్యాపకుల నియామకాలపై ఇంతవరకు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీలో 1,230 బోధనా సిబ్బంది పోస్టులుంటే, 435 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ వర్సిటీలో 383 పోస్టులకుగాను193 ఖాళీగా ఉన్నాయి. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఆరుగురు మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. శాతవాహన వర్సిటీలో 63 పోస్టులుంటే.. 51 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మహాత్మాగాంధీ వర్సిటీలో 70కిగాను 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జేఎన్‌టీయూ(హెచ్)లో 300 పోస్టులుంటే, వాటిలో 125 ఖాళీగానే ఉన్నాయి.

 పేరుకే ఐక్యూఏసీలు
 విద్య, పాలనాపరంగా బలోపేతం చేసి, ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రతి విద్యా సం స్థలో ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ (ఐ క్యూఏసీ) తప్పనిసరిగా ఉండాలని నాక్ ఇదివరకే స్పష్టం చేసింది. అవి ప్రతి ఏటా నాణ్యతా ప్రమాణాల నివేదికను రూపొం దించి, నాక్ గుర్తింపు కోసం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం వర్సిటీల్లో పేరుకే ఐక్యూఏసీలు ఉన్నాయి తప్ప అవి పెద్దగా పని చేస్తున్నట్లు లేదు.

 నిధులిస్తామన్నా స్పందన కరువు
 రాష్ట్రంలోని వర్సిటీలకు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు నాక్ గుర్తింపు తెచ్చుకోవాలని గత ఏడాది జనవరిలో రూసా పీఏబీ స్పష్టం చేసింది. అయినా ఉన్నత విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. నాక్ గుర్తింపు కోసం ప్రయత్నం చేసేందుకు ఓ కమిటీని నియమించింది తప్ప బోధన, నాణ్యతపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా వచ్చే విద్యా సంవత్సరంలోనూ పెద్దగా రూసా నిధులు వచ్చే పరిస్థితి లేదు. 2015-16 విద్యా సంవత్సరంలో రూసా కింద రాష్ట్రానికి రూ. 400 కోట్లు అవసరమని ప్రతిపాదనలివ్వగా, రూ. 112 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నాక్ గుర్తింపు లేకపోవడం వల్లే నిధులివ్వడం లేదని స్పష్టం చేసింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్, శాతవాహన, పాలమూరు వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో దానికి రూ. 20 కోట్ల చొప్పున రూ. 100 కోట్లు ఇవ్వాలని కోరితే.. కేవలం ఉస్మానియాకు మాత్రమే రూ. 20 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. అదీ గతంలో వచ్చిన నాక్ గుర్తింపు ఉన్నందున ఓకే చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement