ఎడ్యుకేషన్ & జాబ్స్ | Education & Jobs | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్ & జాబ్స్

Published Wed, Sep 16 2015 8:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Education & Jobs

హాజరు లేకుంటే పరీక్షలు రాయనివ్వం
 
*  త్వరలో పీహెచ్‌డీ ప్రవేశాలు: ఓయూ రిజిస్ట్రార్


హైదరాబాద్: యూజీసీ నిబంధనల ప్రకారం హాజరు శాతాన్ని కట్టుదిట్టం చేశామని, హాజరు 75 శాతం లేని పీజీ విద్యార్థులను పరీక్షలను రాయనివ్వబోమని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ అన్నారు. మంగళవారం క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల, ఆర్ట్స్ కాలేజీలను సందర్శించి తరగతి గదుల్లో విద్యార్థుల హాజరును పరిశీలించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ మాట్లాడుతూ హాజరుశాతం ఇంత కాలం నిబంధనలకు మాత్రమే పరిమితమైందని, ఇక నుంచి ఖచ్చిత అమలుకు గట్టి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇక నుంచి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించేందుకు వారానికి రెండు రోజులు ఓయూ పరిధిలోని వివిధ కళాశాలలను సందర్శించనున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరానికి అర్హత గల ప్రతి పీజీ విద్యార్థి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పీహెచ్‌డీ అర్హత మార్కులను ఇదివరకే 10వరకు తగ్గించామని, రెండోసారి మార్కులు తగ్గించేందుకు ఇన్‌చార్జి వీసీ ఆర్‌ఆర్ ఆచార్య అంగీకరించలేదన్నారు. పీహెచ్‌డీలో ప్రవేశాలకు త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ చెప్పారు. రూసా నిధులు అందిన వెంటనే హాస్టళ్ల మరమ్మతు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
 
23న ‘నిమ్స్’ రెండో విడత కౌన్సెలింగ్
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 23న నిర్వహించనున్నట్లు నిమ్స్ సమాచార శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. బీఎస్సీ నర్సింగ్ ఒక సీటుకు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ కోర్సుకు రెండు సీట్ల కోసం ఇప్పటికే మొదటి కౌన్సెలింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. 23 ఉదయం 9:30కి నిమ్స్ పాత భవనం మొదటి అంతస్థులోని లెర్నింగ్ సెంటర్‌లో అభ్యర్థులు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.nims.edu.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
 
బీడీఎస్ ద్వితీయ ఫలితాలు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జులై/ఆగస్టులో నిర్వహించిన బీడీఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ టోటలింగ్ కోసం ఈ నెల 30లోగా సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్(http://ntruhs.ap.nic.in) లో పొందవచ్చు.
 
ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఎంబీఏ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్యాట్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పింనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 30వ తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలను www.uohyd.ac.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
 
రేపు బీఈడీ అభ్యర్థుల జాబితా విడుదల
హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా బీఈడీ కోర్సులో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేయనునట్లు ఎడ్‌సెట్-2015 కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 26 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు మంగళవారం పేర్కొన్నారు. సీటు సాధించిన అభ్యర్థులు ఈ నెల 26 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించాలన్నారు. భర్తీ కాని బీఈడీ సీట్లకు త్వరలో రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టనునట్లు వెల్లడించారు.
 
మెరిట్ స్కాలర్‌షిప్ ఫీజు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నవంబర్ 8 న జరిగే రాష్ట్రస్థాయి ఎన్‌టీఎస్‌ఈ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షల ఫీజు గడువును ఈనెల 16కు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో కాని, ప్రభుత్వ పరీక్షల వెబ్‌సైట్  www.bsetelangana.org లో గానీ సంప్రదించవచ్చని తెలిపారు.
 
వొకేషనల్ కోర్సుల గుర్తింపునకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఇంటర్మీడియట్ వొకేషనల్ కరస్పాండింగ్ కోర్సులకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కోసం నిర్వహించే పారా మెడికల్ తదితర కోర్సులకు గుర్తింపునిచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి కన్వీనర్‌గా ఇంటర్ విద్య కమిషనర్ వ్యవహరిస్తారు. సాంకేతిక విద్య కమిషనర్, ఎస్‌బీటీఈటీ కార్యదర్శి, లేబర్, ఎంప్లాయిమెంట్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు.
 
ఎన్‌ఎస్‌ఎస్ అవార్డుల ఎంపికకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సర్వీసు స్కీంలో (ఎన్‌ఎస్‌ఎస్) రాష్ట్ర స్థాయి అవార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఒక బెస్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, 6 బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్, 9 బెస్ట్ వాలంటీర్ అవార్డులకు అర్హత కలిగిన వారిని ఎంపిక చేసేందుకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఈ కమిటీ రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది.
 
‘ఓపెన్’ ఫీజు గడువు నేటితో పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఫీజు చెల్లింపునకు ఈనెల 16 వరకు గడువు పొడిగించినట్లు సొసైటీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement