
గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి దానం నాగేందర్ వెల్లడించారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. శనివారమిక్కడ తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమష్టికృషి లేకపోవడం వల్లనే గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిందన్నారు. గ్రూపులను ప్రోత్సహించడం వల్లే కాంగ్రెస్ ఈ స్థాయికి దిగజారిందన్నారు.
ఈ నెల 2న పోలింగ్ ముగియగానే కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోతున్నట్లు చెప్పానని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలను కాంగ్రెస్ దూరం చేసుకుందని అందుకే ఓటర్లు ఈ తీర్పునిచ్చారని విశ్లేషించారు. సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలను అమలుపర్చాలని లేకుంటే ఆర్నెల్ల తర్వాత కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎన్నికల సారథిగా పనిచేసిన మంత్రి కేటీఆర్ అందరినీ సమన్వయం చేసుకుని గెలిచారని ప్రశంసిచారు.