గణేశా.. ఏమిటీ ట్రాఫిక్ జామ్? | delay in vinayaka idol immersion leads heavy traffic jam in hyderabad | Sakshi
Sakshi News home page

గణేశా.. ఏమిటీ ట్రాఫిక్ జామ్?

Published Mon, Sep 28 2015 10:15 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

గణేశా.. ఏమిటీ ట్రాఫిక్ జామ్? - Sakshi

గణేశా.. ఏమిటీ ట్రాఫిక్ జామ్?

వివిధ ప్రాంతాలనుంచి భారీగా వస్తున్న వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ నిదానంగా కొనసాగడంతో నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జాం అయింది. వినాయక విగ్రహాలు ఎక్కడికక్కడ రోడ్ల పై నిలిచి ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా కోఠి నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ వైపు రావాల్సిన వాహనచోదకులకు ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ఎక్కడికక్కడ రోడ్లను బారికేడ్లతో మూసేయడంతో ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి.

ఇక సిటీ బస్సులలో వెళ్లే వాళ్లకయితే అంతా అయోమయమే. ఎక్కిన బస్సు ఎటు వెళ్తుందో, అసలు వెళ్తుందో వెళ్లదో, గమ్యం చేరుకుంటుందో లేదో తెలియదు. కండక్టర్లను అడిగితే, ''ఎక్కడికి వెళ్లాలో అక్కడికే టికెట్ తీసుకోండి.. బస్సు ఎక్కడ ఆగిపోతే అక్కడ దిగిపోండి. ఎటు వెళ్తుందో, ఎటు తిరుగుతుందో మాకు తెలీదు'' అనే సమాధానం ఎదురైంది. కోఠి నుంచి లక్డీకాపుల్ వచ్చేందుకు మామూలుగా అయితే 10-15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కానీ సోమవారం ఉదయం మాత్రం దాదాపు 45 నిమిషాల వరకు పట్టింది. అది కూడా కోఠి నుంచి అబిడ్స్ వెళ్లకుండా నారాయణగూడ మీదుగా బషీర్బాగ్ మీదుగా లక్డీకాపుల్ చేరుకోవాల్సి వచ్చింది.

సోమవారం ఉదయం ఆఫీసుకు బయలుదేరిన వారు ట్రాఫిక్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోఠి, సికింద్రాబాద్, అఫ్జల్ గంజ్, హిమాయత్ నగర్ల నుంచి ట్యాంక్ బండ్ వైవు వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. గతంలో కూడా గణేశ్ నిమజ్జనాలు జరిగినా, ఎప్పుడు మర్నాటి ఉదయం ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన దాఖలాలు లేవని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు వేదిక నుంచి ప్రత్యేక వాహనం మీదకు చేర్చారు. శోభాయాత్ర ప్రారంభం కూడా చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. ట్యాంక్ బండ్ వద్ద మామూలుగా చేసే విగ్రహాల నిమజ్జనమే ఇంకా పూర్తి కాకపోవడంతో దీనికి అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఇక ఆ విగ్రహం శోభాయాత్ర జరిగే సమయంలో ఖైరతాబాద్ నుంచి సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ మరింత దారుణంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement