
అంతా అస్తవ్యస్తం
* డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు
* కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు
* 15లోగా ప్రభుత్వానికి తుది నివేదిక
సాక్షి, సిటీబ్యూరో: డీలిమిటేషన్ ముసాయిదాపై ప్రజలతో పాటు వివిధ రాజకీయ పక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అస్తవ్యస్తంగా ఉందని ఆరోపిస్తూ కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి తుది నివేదిక అందించేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో వాతావరణం వేడెక్కింది.
మరోవైపు కొన్ని సర్కిల్ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి ఇంకా తుది ప్రతిపాదనలు అందలేదు. ఏ సర్కిల్ నుంచి ఎన్ని అభ్యంతరాలు అందాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జనాభా దామాషాకు అనుగుణంగా డీలిమిటేషన్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ... కొత్తగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లలో ఎక్కడ ఎంత జనాభా ఉందో... దాని స్వరూప స్వభావాలేమిటో తెలిపే మ్యాపులను అధికారులు ప్రజల ముందు ఉంచలేదు. దీనిపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అభ్యంతరాలను నామ్‌కేవాస్తేగా ఆహ్వానించారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేస్తారా? లేక యధావిధిగా తుది జాబితా తయారు చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని త్వరితంగా పూర్తి చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ జనార్దన్‌రెడ్డి డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఒకటికి రెండు పర్యాయాలు అన్నీ పరిశీలించి తుది నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యంగా ఎల్‌బీనగర్ సర్కిల్‌లో అభ్యంతరాలను మరోమారు పరిశీలించి... ముఖ్యాంశాలను పరిగణనలోకి తీసుకొని తుది నివేదిక రూపొందించాల్సిందిగా సూచించారు.
అలాగే పటాన్‌చెరు, ఆర్‌సీపురం సర్కిల్ నుంచి అందిన అభ్యంతరాలను పరిశీలించాల్సిందిగా సూచించారు. ఇంకా, పాతబస్తీ పరిధిలోని సర్కిల్ 4, 5, 7బి, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ సర్కిళ్లలోనూ పరిశీలించాల్సిన కీలకాంశాలు ఉన్నాయని... వాటిని జాగ్రత్తగా సమీక్షించాలని సూచించినట్లు తెలిసింది. అస్తవ్యస్తంగా, అభ్యంతరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై డిప్యూటీ కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించారు. వివిధ అంశాలపై 200కు పైగా అభ్యంతరాలు అందాయి.
అభ్యంతరాలలో కొన్ని...
* సర్కిల్-9బికి 36 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఎక్కువగా కాచిగూడ డివిజన్ పేరును తొలగించడంపైనే ఉన్నాయి.
* కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో 20 ఫిర్యాదులు రాగా... షాపూర్ నగర్ పేరును కొనసాగించాలనే డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి.
* మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లకు సంబంధించి 14 అభ్యంతరాలు అందగా.. నేరేడ్‌మెట్, యాప్రాల్ డివిజన్ల పేర్లను కొనసాగించాలని ఎక్కువ మంది కోరారు.
* సికింద్రాబాద్ సర్కిల్ నుంచి కేవలం 6 అభ్యంతరాలు మాత్రమే అందాయి. వీటిలో 4 చిలకలగూడ డివిజన్‌ను గల్లంతు చేయవద్దనే వచ్చాయి.
* శేరిలింగంపల్లి-1 సర్కిల్‌లోని భెల్ ఎంఐజీ కాలనీని మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటయ్యే భారతీ నగర్ డివిజన్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
* శేరిలింగంపల్లి సర్కిల్-2 పరిధిలో మూడు ఫిర్యాదులు అందాయి. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను రెండు సర్కిళ్లలోనే ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు.
* ఉప్పల్ సర్కిల్‌లో 21 అభ్యంతరాలు రాగా... ఉప్పల్ డివిజన్‌లో రామంతాపూర్‌కు చెందిన కాలనీలను కలప వద్దని స్థానికులు అభ్యంతరం చెప్పారు.
* కొన్ని కాలనీలను సగం ఒక డివిజన్, మిగిలిన సగం మరో డివిజన్‌కు కేటాయించారని... అలా కాకుండా ఒక కాలనీని ఒకే డివిజన్‌లో వచ్చే విధంగా ఉంచాలని కోరారు.
* కాప్రా సర్కిల్‌కు మొత్తం 40 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో ప్రతిపాదిత మల్లాపూర్, హౌసింగ్ బోర్డు, చర్లపల్లి డివిజన్లకు సంబంధించి ఎక్కువగా అభ్యంతరాలు వచ్చాయి.
* వివిధ అంశాలపై మరికొన్ని సర్కిళ్ల నుంచి కూడా అభ్యంతరాలు అందాయి.
బీసీ గణన 25 శాతమే
బీసీ గణనకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు గురువారం వరకు దాదాపు 25 శాతం పూర్తి చేశారు. గ్రేటర్‌లోని మొత్తం జనాభా 70,68,495. ఇప్పటి వరకూ 17,56,715 మంది సర్వే పూర్తి చేశారు. ఇంకా 53,11,780 మంది సర్వే జరగాల్సి ఉంది. ఈనెల 18 లోగా ఇది పూర్తి చేయాల్సి ఉంది. ఇంత స్వల్ప వ్యవధిలో కచ్చితమైన సమాచారంతో సర్వే పూర్తి చేయడం అధికారులకు సవాల్‌గా మారింది.