సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం కొలిక్కి రావడం, వివిధ కేంద్ర డైరెక్టరేట్ల నుంచి కీలక అనుమతులు లభించిన నేపథ్యంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా దిశగా రాష్ట్ర ప్రభు త్వం మళ్లీ ప్రయత్నాలు వేగిరం చేసింది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు కేంద్ర జల వనరుల సహాయ మంత్రి అర్జున్ రాం మేఘవాల్‌కు జాతీయ హోదా అంశమై వినతి పత్రం సమర్పించనుంది. రాష్ట్రం తరఫున 5 ఎజెండా అంశాలను పేర్కొంటూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి శనివారం కేంద్రానికి లేఖ రాశారు.
అదనపు వాటా కోసం పట్టు
రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇది వరకే కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధాని మోదీకి విన్నవించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు నీటి పారుదల వర్గాలు తెలిపాయి. అలాగే కృష్ణా జలాల్లో అదనపు వాటాల అంశాన్ని 20వ తేదీ నాటి సమావేశాల్లో ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం కృష్ణాలో ఉన్న నికర జలాల వాటాను పెంచేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించింది.
పోలవరం, పట్టిసీమల ద్వారా ఏపీ గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న జలాల్లోనూ న్యాయ బద్ధంగా దక్కే వాటాల అంశాన్నీ చర్చించనుంది. అలాగే పోలవరంతో తెలంగాణలో ఉండే ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం అవసరాన్ని నొక్కి చెప్పాలని, దీనిపై చర్చించాలని కోరనుంది. పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టుల కింద అదనపు నీటి వినియోగాన్ని తగ్గించేలా టెలిమెట్రీ వ్యవస్థను త్వరగా అమల్లోకి తెచ్చే అంశాన్ని ఎజెండాలో చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment