
ధోవతి మెడకు చుట్టి.. ఊపిరాడకుండా చేసి..
ఇంట్లో ఒంటరిగా ఉన్న పండు ముదుసలిని కర్కశంగా మట్టుబెట్టిన ఆగంతకులు అందినంతా దోచుకుపోయారు.
- ఒంటరిగా ఇంట్లో ఉన్న వృద్ధుడి దారుణ హత్య
- 4 తులాల బంగారు నగలు, ఎల్‌ఈడీ టీవీ చోరీ
కుషాయిగూడ, న్యూస్‌లైన్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న పండు ముదుసలిని కర్కశంగా మట్టుబెట్టిన ఆగంతకులు అందినంతా దోచుకుపోయారు. ధనవంతులు నివసించే పోష్ కాలనీ అయిన సాకేత్ టౌన్‌షిప్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా కలకలం సృష్టించింది. కుషాయిగూడ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా, రాజోలుకు చెందిన కె.వెంకట లక్ష్మీనరసింహారావు (91)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు.
స్వగ్రామంలో వ్యవసాయం చేసుకునే నరసింహారావు, పెద్దకొడుకుతో పాటు అక్కడే ఉండేవారు. అయితే జూబ్లీహిల్స్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న చిన్నకొడుకు హనుమంతరావుకు తోడుగా ఉండేందుకు కొన్ని నెలల క్రితం నగరానికి వచ్చారు. సాకేత్ ఫేజ్-2లో నివసించే హనుమంతరావు భార్య మాధవి కూడా కంప్యూటర్ ఇంజనీర్. సోమవారం ఉదయం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ ఆగంతకులు నరసింహారావు మెడకు ధోవతీతో ఉరి బిగించి, దుప్పట్లు, టవల్స్‌తో ఊపిరాడకుండా చేసి మట్టుబెట్టారు.
బీరువాలో ఉన్న నగలు, హాలులోని టీవీ, పూజగదిలో వెండి సామగ్రి, ఇతర విలువైన వస్తువులతో ఉడాయించారు. అయితే డూప్లెక్స్ ఇంటిపై అంతస్తుకు తాళం వేసి ఉండటంతో దాన్ని తెరిచేందుకు ఆగంతకులు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండున్నర గంటల మధ్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మనవరాలు చూడటంతో...
కాగా, భవన్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న మృతుడి మనవరాలు సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చూడగా, మంచంపై నరసింహారావు మృతదేహం పడి ఉంది. ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విషయం చెప్పింది. వారు అక్కడి నుంచే అటు పోలీసులకు, ఇటు బంధుమిత్రులకు సమాచారం అందించారు. ఈలోగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఆల్వాల్ డీసీపీ కోటేశ్వర రావు, ఏసీపీ జి.ప్రకాశరావులు సందర్శించారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, అనుమానితుల గురించి ఆరా తీస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు.