
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దర్శకుడు
హైదరాబాద్: చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ సినీ రచయిత, దర్శకుడు రాజేష్ సాయి ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన దీక్షా శిబిరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం చిన్న సినిమా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.వంద కోట్లతో నిర్మితమవుతున్న సినిమాల్లాగే కోటి రూపాయలతో తీసిన చిన్న సినిమాలు కూడా లొకేషన్ చార్జీలు, పబ్లిసిటీ చార్జీలు చెల్లిస్తున్నాయని, అయితే థియేటర్లు దొరకక విడుదలకు నోచుకోని దుస్థితిలో ఉన్నాయన్నారు. పెద్ద సినిమా వచ్చిందంటే చాలు.. చిన్న సినిమా బాగా ఆడుతున్నా కూడా పక్కకు నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 థియేటర్లను ప్రభుత్వం అధీనంలో ఉంచుకోవాలని వాటిని చిన్న సినిమాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న సినిమా విడుదలకు ఎదురవుతున్న థియేటర్ల సమస్యను ప్రభుత్వం పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.