కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి
శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇరవై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరువు నెలకొందని, కేంద్రం నుంచి భారీగా సహాయం పొందేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగడం కోసం అవసరమైతే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌లను తీసుకొస్తామని పేర్కొన్నారు. అనావృష్టి పరిస్థితిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా సోమవారం ఆయన శాసనమండలిలో మాట్లాడారు. కరువు మండలాల ప్రకటన లోపభూయిష్టంగా ఉందని, మరోసారి కేంద్ర కరువు బృందాన్ని రప్పించి సర్వే చేయించాలని, 438 రూరల్ మండలాలను కరువు జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
గత పాలకుల వైఫల్యమే కారణం: కర్నె ప్రభాకర్
తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడానికి గత పాలకుల వైఫల్యాలే కారణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. కరువు నివారణ కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యాల వల్లే కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు వందలాది చెక్‌డ్యాంలు నిర్మించాయన్నారు. ఎడాపెడా అడవులను నరికేయడం వల్ల వర్షపాతం భారీగా తగ్గిందన్నారు.
భేషజాలం లేకుండా సహాయం కోరండి: రామచంద్రరావు
రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా కేంద్రానికి కరువు సహాయం కోరి తెచ్చుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు సూచించారు. కేంద్రానికి మొత్తం రూ.3,064 కోట్లు సహాయంగా కోరితే.. కేవలం రూ.791 కోట్లు ప్రకటించి, రూ 56 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు.
టీడీపీ వాళ్లు అక్కడున్నందుకే వానలు పడతలేవు: ఆకుల లలిత
‘టీడీపీ నేతల కాలి ముహూర్తం మంచిది కాదు. వాళ్లు అడుగు పెడితే ప్రకృతి సహకరించదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చాన మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. అందుకే వానలు పడతలేవు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత విమర్శలు గుప్పించారు. మంత్రి పోచారం జోక్యం చేసుకొని అందరి కాళ్ల ముహూర్తాలు మంచివేనని, నదుల నీటిని సద్వినియోగం చేసుకొని ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని సర్దిచెప్పారు. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం కూడా అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సభను వాయిదా వేశారు.
మండలిలో చర్చ
Published Tue, Mar 22 2016 12:38 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement