వేతనపెంపు వర్తించదా..?
♦ పారిశుద్ధ్య కార్మికులకు వర్తించని ‘ఔట్ సోర్సింగ్’
♦ వేతన పెంపు జీవో 8 నెలలుగా పెండింగ్‌లో
♦ వేతనాల పెంపు ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు ఓవైపు..చాలీచాలనీ వేతనాలు మరోవైపు.. వెరసి మున్సిపల్ తాత్కాలిక కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. సమ్మె చేసినా ఫలితం రాకపోవడంతో అలసిపోయిన పారిశుద్ధ్య కార్మికులు తిరిగి విధుల్లో చేరి 8 నెలలు గడుస్తున్నా వేతనాల పెంపుపై మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను పెంచుతూ గత నెల 19 రాష్ట్ర ప్రభుత్వం జీవో 14 జారీ చేయడంతో మళ్లీ మున్సిపల్ కార్మికుల్లో ఆశలు చిగురించాయి.
అయితే, రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 15 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పారి శుద్ధ్య, పారిశుద్ధ్యేతర కార్మికులకు ఈ ఉత్తర్వు లు వర్తించవని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చడం తో కార్మికుల ఆశలు ఆవిరయ్యాయి. గత కొన్నేళ్లుగా మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పం చాయతీల్లో రూ.7,300 నామమాత్రపు వేతనాలను తాత్కాలిక కార్మికులకు చెల్లిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.8,500 నుంచి రూ. 12,500కు, డ్రైవర్ల వేతనాన్ని రూ.10,200 నుం చి రూ.15,000కు పెంచుతూ గత జూలై 16న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన 67 పురపాలికల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది.
ఇచ్చిన హామీ మరిచారు...
9వ పీఆర్‌సీలో 4వ తరగతి ఉద్యోగుల వేతన సిఫారసుల ఆధారంగా ... మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 ను కనీస వేతనంగా చెల్లిస్తున్నారు. ఉద్యోగుల తరహాలో 43 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని తమకూ వర్తింపజేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందరితో పాటే మున్సిపల్ కార్మికుల వేతనాలను సైతం పెంచుతామని అప్పట్లో రాష్ట్ర ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది. గత నెలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచిన ఆర్థిక శాఖ.. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపును మాత్రం మరిచిపోయింది.