Pay hikes
-
స్పైస్‌జెట్ దీపావళి కానుక: వారికి నెలకు రూ.7 లక్షల జీతం
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన పైలట్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నవంబరు 1 నుంచి వర్తించేలా జీతాలపెంపును ప్రకటించింది. తద్వారా స్పైస్‌జెట్ వారికిదీపావళి కానుక అందించింది. స్పైస్‌జెట్ కెప్టెన్లకు 80 గంటల విమాన ప్రయాణానికి నెలవారీ వేతనం 7 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈపెంపు నవంబర్ 1, 2022 నుండి వర్తిస్తుందని తెలిపింది. ట్రైనర్స్, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ల వేతనాలను కూడా తగిన విధంగా పెంచినట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన పైలట్ వేతనాలను సవరించినట్టు తెలిపింది. అక్టోబర్‌లో కెప్టెన్లు , ఫస్ట్ ఆఫీసర్ల జీతం 22 శాతం పెంచింది. ఆగస్టుతో పోలిస్తే, సెప్టెంబర్ జీతంలో శిక్షకులకు 10 శాతం, కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల వేతనం 8 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. -
ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ఆదాయాలను కోల్పోయిన పలు సంస్థలు ఉద్యోగాల కోత, వేతనాలు తగ్గింపు లాంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న తమ ఉద్యోగులకు అండగా నిలవాలని భావించింది. వేతనాలు పెంపు, పదోన్నతులు ప్రకటించి ప్రత్యేకంగా నిలిచింది. తన సిబ్బంది మనోస్థైర్యాన్ని పెంచడం కీలకమని, అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని రెనాల్ట్ ఇండియా తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం పోలిస్తే ఈ పెంపు ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కరోనా, లాక్ డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఐపిఎల్) తన ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును అమలు చేయనుంది. 2021 ఆర్థిక సంవత్సరానికి పదోన్నతులు కూడా ఇస్తోంది. ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చేలా 250 మంది ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును ప్రకటించింది. అలాగే 30 మందికి పైగా అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే జీతాల పెంపు నుంచి తన భాగస్వాములైన నిస్సాన్, రెనాల్ట్ నిస్సాన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ ఇండియాను మినహాయించింది. మరోవైపు ఉద్యోగులకు జీతాలందించేందుకుగాను తన డీలర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కార్లు, విడిభాగాలపై మార్జిన్‌ను 200-300 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. చదవండి : మారుతికి షాక్ : టాప్ సెల్లింగ్ కార్ ఇదే! -
కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ క్యూ4 ఫలితాల సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 4.5 లక్షల తమ ఉద్యోగుల్లో ఎవర్నీ తీసివేయడం లేదని వెల్లడించింది. అయితే జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ సంస్థ తెలిపింది. అయితే కొత్త నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది. ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40వేల మంది నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. (రివర్స్ రెపో రేటు పావు శాతం కోత) మార్చి త్రైమాసికంలో టీసీఎస్ ఆరోగ్యకరమైన లాభాలను నివేదించింది. క్యూ 4లో నికర లాభం 0.8 శాతం తగ్గి రూ .8,049 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రతి షేరుకు రూ .6 తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాలు శుభారంభం చేశాయి, కొన్ని భారీ డీల్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలలో కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఆదాయ క్షీణించే అవకాశం ఉందని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కంపెనీ పట్ల ఉద్యోగులు చూపించిన నిబద్ధతను గోపీనాథన్ ప్రశంసించారు. ప్రస్తుతం భారతదేశంలో 355,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో 90 శాతం మంది ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి సురక్షితమైన కార్యాలయాలతో అనుసంధానించబడ్డారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. మెరుగైన ఫలితాలతో శుక్రవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేరు టాప్ గెయినర్ గా వుంది. (7.4 శాతం వృద్ధిని సాధిస్తాం) చదవండి : రూపాయికి ఆర్బీఐ 'శక్తి' -
విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై : సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా డిజిటల్ రంగంలోని ఉద్యోగులకు భారీగా స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చింది. వీరితోపాటు కొత్తగా చేరిన ఉద్యోగులకు కూడా ప్రోత్సాహక రివార్డులను ప్రకటించడం విశేషం. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రో జూనియర్ లెవల్ ఉద్యోగుల నుంచి అయిదేళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులకు వేతనాలను పెంచింది. ముఖ్యంగా మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి డిజిటల్ టెక్నాలజీలో పని చేస్తోన్న ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ప్రకటించింది. ఇండియాలోని ఆఫ్‌షోర్ ఉద్యోగులు, ఆన్లైన్ ఉద్యోగులు, అమెరికా, యూరోప్‌లలోని ఉద్యోగులకు వేతనాలను 6 శాతం -8 శాతం మధ్య పెంచింది. సవరించిన జీతాలు జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. సగటున ఆఫ్‌షోర్ ఉద్యోగులకు హైసింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్, ఆన్సైట్ ఉద్యోగులకు లో నుంచి మిడిల్ సింగిల్ డిజిట్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేటివ్, ఫ్యూచర్ ఓరియెంటెడ్ టెక్నాలజీపై పని చేస్తున్న ప్రారంభ ఉద్యోగులకు ప్రోత్సహకంగా ప్రత్యేకమైన ఇన్సెంటివ్‌లు, రివార్డులు ఇవ్వనుంది. కాగా విప్రోలో మార్చి 31, 2019 నాటికి 1.7 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎక్కువగా 1 నుండి 5 ఏళ్ల అనుభవం కలిగిన వారు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో విప్రో క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ ప్రకటించింది. విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ ప్రకటించగా, ఆయన స్థానంలో వారసుడు రిషద్ ప్రేమ్ జీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జూలై 31 నుంచి బాధ్యతలను తీసుకోనున్న సంగతి తెలిసిందే. -
స్నాప్‌డీల్‌లో 15% వేతనాల పెంపు!
న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్.. ఉద్యోగుల్లో భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి 15 శాతం దాకా వేతనాలు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మధ్య, జూనియర్ స్థాయి ఉద్యోగుల జీతాలు సగటున 12–15 శాతం పెరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు పెంపు 9–12 శాతంగా ఉండొచ్చని... అసాధారణ పనితీరు కనపర్చిన వారికి 20–25 శాతం దాకా ఉండగలదని వివరించాయి. పే రివిజన్ ఏప్రిల్ 1 నుంచి వర్తింపచేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు షేర్లు కూడా... కంపెనీ షేర్లలో 1 శాతాన్ని సుమారు 150 మంది ఉద్యోగులకు పంపిణీ చేయవచ్చని స్నాప్‌డీల్ వర్గాలు తెలియజేశాయి. స్నాప్‌డీల్ ఈ–కామర్స్ కార్యకలాపాల్లో 3,000 మంది పైచిలుకు ఉద్యోగులున్నారు. ఇది కాకుండా మొబైల్ వాలెట్ (ఫ్రీచార్జ్), లాజిస్టిక్స్ (వల్కన్) కార్యకలాపాలు కూడా కంపెనీకి ఉన్నాయి. ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ కలిపి స్నాప్‌డీల్‌లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ రూపంలో 5–6 శాతం వాటాలున్నాయి. అత్యధికంగా పెట్టుబడులున్న సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ.. నిధుల కొరత ఎదుర్కొంటున్న స్నాప్‌డీల్‌ను విక్రయించే యత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వేల్యుయేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు మిగతా భాగస్వాములైన కలారి క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్‌తో కూడా సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతోంది. ఇటీవలే 1.4 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్న పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. స్నాప్‌డీల్ కొనుగోలు రేసులో ముందుంది. -
వేతనాల పెంపునకు కృషి చేస్తా
నల్లగొండ టౌన్ : సర్వ శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న పార్ట్‌టైం ఆర్ట్స్, క్రాఫ్ట్ టీచర్లకు వేతనాలను పెంచడానికి తన వంతుగా కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమోహన్ అన్నారు. శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఆర్ట్స్, క్రాఫ్ టీచర్లు ఏర్పాటు చేసిన ఆర్ట్స్, క్రాఫ్ట్ గ్యాలరీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమస్యలను పరిస్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామన్నారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కొండేటి నివాస్ మాట్లాడుతూ ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.18 వేలకు పెంచాలని, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వేసవి సెలవుల్లో కూడా వేతనాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేణు సంకోజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ ఏఎంఓ శ్రీనివాస్‌గౌడ్, సంఘం గౌరవాధ్యక్షుడు ఉపేంద్రాచారి, కోశాధికారి వనజాదేవి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, శ్రీరాములు, నాయకులు పోతరాజు మౌనిక, నరేష్, జానయ్యగౌడ్, బొజ్జ అంజయ్య, దుర్గ, మనోహర్, ఏచూరి శైలజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, క్రాఫ్ట్, ఆర్ట్ టీచర్లు వేసిన చిత్రాలు, తయారు చేసిన వివిధ రకాల క్రాఫ్ట్ వస్తువులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
వేతనపెంపు వర్తించదా..?
♦ పారిశుద్ధ్య కార్మికులకు వర్తించని ‘ఔట్ సోర్సింగ్’ ♦ వేతన పెంపు జీవో 8 నెలలుగా పెండింగ్‌లో ♦ వేతనాల పెంపు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు ఓవైపు..చాలీచాలనీ వేతనాలు మరోవైపు.. వెరసి మున్సిపల్ తాత్కాలిక కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. సమ్మె చేసినా ఫలితం రాకపోవడంతో అలసిపోయిన పారిశుద్ధ్య కార్మికులు తిరిగి విధుల్లో చేరి 8 నెలలు గడుస్తున్నా వేతనాల పెంపుపై మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను పెంచుతూ గత నెల 19 రాష్ట్ర ప్రభుత్వం జీవో 14 జారీ చేయడంతో మళ్లీ మున్సిపల్ కార్మికుల్లో ఆశలు చిగురించాయి. అయితే, రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న 15 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పారి శుద్ధ్య, పారిశుద్ధ్యేతర కార్మికులకు ఈ ఉత్తర్వు లు వర్తించవని రాష్ట్ర పురపాలక శాఖ తేల్చడం తో కార్మికుల ఆశలు ఆవిరయ్యాయి. గత కొన్నేళ్లుగా మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పం చాయతీల్లో రూ.7,300 నామమాత్రపు వేతనాలను తాత్కాలిక కార్మికులకు చెల్లిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.8,500 నుంచి రూ. 12,500కు, డ్రైవర్ల వేతనాన్ని రూ.10,200 నుం చి రూ.15,000కు పెంచుతూ గత జూలై 16న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మిగిలిన 67 పురపాలికల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇచ్చిన హామీ మరిచారు... 9వ పీఆర్సీలో 4వ తరగతి ఉద్యోగుల వేతన సిఫారసుల ఆధారంగా ... మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 ను కనీస వేతనంగా చెల్లిస్తున్నారు. ఉద్యోగుల తరహాలో 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని తమకూ వర్తింపజేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందరితో పాటే మున్సిపల్ కార్మికుల వేతనాలను సైతం పెంచుతామని అప్పట్లో రాష్ట్ర ఆర్థిక శాఖ హామీ ఇచ్చింది. గత నెలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచిన ఆర్థిక శాఖ.. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపును మాత్రం మరిచిపోయింది. -
మా దృష్టికి అలాంటిదేం రాలేదు!
‘‘వేతనాల పెంపు విషయంలో గత కొన్ని నెలలుగా కార్మికుల సమాఖ్యకూ, చలన చిత్ర వాణిజ్య మండలికీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కార్మిక సమాఖ్య కోరుకున్నట్లుగానే వేతనాలు పెంచాం. ఆ విషయం నిర్మాతలందరికీ తెలియాలనే ఆకాంక్షతో పత్రికా ప్రకటనలు ఇచ్చాం’’ అని ఏ.పి.చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ చెప్పారు. బుధ వారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘భారతదేశంలో తెలుగు పరిశ్రమ పెంచినంత వేతనాలు వేరే చోటెక్కడా పెంచలేదు. దక్షిణాది పరిశ్రమ మొత్తం ఒకేసారి పెంచుదామన్నా.. మేం అంగీకరించలేదు. ఇక్కడి కార్మికులకు న్యాయం చేసే దిశలో పెంచాం. అయితే, చిన్న చిత్రాల నిర్మాతలకు కష్టమవుతుంది కాబట్టి, వారికి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని కార్మికుల సమాఖ్యను కోరాం. అక్టోబర్ 21న నుంచి మారిన వేతనం వర్తిస్తుంది’’ అని చెప్పారు. చిన్న సినిమాల అని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు? అనే ప్రశ్నకు జవాబిస్తూ -‘‘అది చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయిస్తుంది’’ అన్నారు. గురువారం నుంచి కార్మికులు స్ట్రయిక్ చేయనున్నారనే సంగతి ప్రస్తావిస్తే, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ స్పందిస్తూ -‘‘మా దృష్టికి అలాంటిదేం రాలేదు. వేతనాల విషయంలో వారు సంతృప్తికరంగానే ఉన్నారు. అయితే, ఫెడరేషన్‌కు సంబంధించినవాళ్లనే తీసుకోవాలనే వారి ప్రతిపాదనను మేం అంగీకరించలేం. ఎందుకంటే, ఏ నిర్మాతకైనా ఎవరితో పని చేయించుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. అలాగే, చిన్న చిత్రాలపరంగా వేతనాల విషయంలో కొంచెం వెసులుబాటు ఇవ్వాలనే మా ప్రతిపాదనను వారు అంగీకరించలేదు. ఈ రెండు విషయాలు మినహా మా మధ్య వేరే విభేదాలు లేవు. ఈ రెండింటినీ కారణంగా చూపించి, స్ట్రయిక్ చేస్తే మేం చేయగలిగిందేమీ లేదు’’ అని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాతలు కొడాలి వెంకటేశ్వరరావు, ఎంఎల్ కుమార్ చౌదరి, కె. సురేశ్‌బాబు పాల్గొన్నారు.