మా దృష్టికి అలాంటిదేం రాలేదు!
‘‘వేతనాల పెంపు విషయంలో గత కొన్ని నెలలుగా కార్మికుల సమాఖ్యకూ, చలన చిత్ర వాణిజ్య మండలికీ చర్చలు జరిగిన విషయం తెలిసిందే. కార్మిక సమాఖ్య కోరుకున్నట్లుగానే వేతనాలు పెంచాం. ఆ విషయం నిర్మాతలందరికీ తెలియాలనే ఆకాంక్షతో పత్రికా ప్రకటనలు ఇచ్చాం’’ అని ఏ.పి.చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ చెప్పారు. బుధ వారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘భారతదేశంలో తెలుగు పరిశ్రమ పెంచినంత వేతనాలు వేరే చోటెక్కడా పెంచలేదు. దక్షిణాది పరిశ్రమ మొత్తం ఒకేసారి పెంచుదామన్నా.. మేం అంగీకరించలేదు. ఇక్కడి కార్మికులకు న్యాయం చేసే దిశలో పెంచాం.
అయితే, చిన్న చిత్రాల నిర్మాతలకు కష్టమవుతుంది కాబట్టి, వారికి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని కార్మికుల సమాఖ్యను కోరాం. అక్టోబర్ 21న నుంచి మారిన వేతనం వర్తిస్తుంది’’ అని చెప్పారు. చిన్న సినిమాల అని ఏ ప్రాతిపదికన గుర్తిస్తారు? అనే ప్రశ్నకు జవాబిస్తూ -‘‘అది చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయిస్తుంది’’ అన్నారు. గురువారం నుంచి కార్మికులు స్ట్రయిక్ చేయనున్నారనే సంగతి ప్రస్తావిస్తే, నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ స్పందిస్తూ -‘‘మా దృష్టికి అలాంటిదేం రాలేదు.
వేతనాల విషయంలో వారు సంతృప్తికరంగానే ఉన్నారు. అయితే, ఫెడరేషన్‌కు సంబంధించినవాళ్లనే తీసుకోవాలనే వారి ప్రతిపాదనను మేం అంగీకరించలేం. ఎందుకంటే, ఏ నిర్మాతకైనా ఎవరితో పని చేయించుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. అలాగే, చిన్న చిత్రాలపరంగా వేతనాల విషయంలో కొంచెం వెసులుబాటు ఇవ్వాలనే మా ప్రతిపాదనను వారు అంగీకరించలేదు. ఈ రెండు విషయాలు మినహా మా మధ్య వేరే విభేదాలు లేవు. ఈ రెండింటినీ కారణంగా చూపించి, స్ట్రయిక్ చేస్తే మేం చేయగలిగిందేమీ లేదు’’ అని చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాతలు కొడాలి వెంకటేశ్వరరావు, ఎంఎల్ కుమార్ చౌదరి, కె. సురేశ్‌బాబు పాల్గొన్నారు.