తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ఆహార్యంతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్‌స్టార్ కృష్ణం రాజు. చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసిన ఆయన ‘అవేకళ్లు’ చిత్రంలో ప్రతినాయకుడిగానూ నటించి తానేంటో నిరూపించుకున్నారు. ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. ఎప్పటికప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి మాస్ చిత్రంలో నటించిన ఆయన భక్తిరస చిత్రం ‘భక్త కన్నప్ప’తో ప్రేక్షకులను తన నటనతో అలరించాడు. ప్రత్యేకంగా కృష్ణంరాజు తన నటనాశైలితో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలో పాత్రలే ఈ పేరుని సంపాదించిపెట్టాయి. తన ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 183 పైగా చిత్రాలలో నటించారు. ఉత్తమ నటుడిగా ప్రారంభ నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు.
జీవన తరంగాలు (1973), కృష్ణవేణి (1974), భక్త కన్నప్ప (1976), అమర దీపం (1977), సతీ సావిత్రి (1978), కటకటాల రుద్రయ్య (1978), మన వూరి పాండవులు (1978) వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. రంగూన్ రౌడీ (1979), శ్రీ వినాయక విజయము (1979), సీతా రాములు (1980), టాక్సీ డ్రైవర్ (1981), త్రిశూలం (1982), ధర్మాత్ముడు (1983), బొబ్బిలి బ్రహ్మన్న (1984), తాండ్ర పాపరాయుడు (1986), మరణ శాసనం (1987), విశ్వనాథ నాయకుడు (1987), అంతిమ తీర్పు (1988), బావ బావమరిది (1993), పల్నాటి పౌరుషం (1994) సినిమాలు ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపద కథల్లోనూ నటించి తన విశిష్టతను చాటుకున్నారు.
కుటుంబ నేపథ్యం
కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయన భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. ప్రభాస్ నట ప్రయాణం తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే విషయమని కృష్ణంరాజు ఎప్పుడూ చెప్తుండేవారు.
చదవండి: Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్
Comments
Please login to add a commentAdd a comment