తాగి చనిపోతే మరిచిపోయేవాడిని: బాబూమోహన్
హైదరాబాద్: ‘మద్యం తాగి వాహనాలను నడపడం తప్పు. దీని వల్ల బతుకు చీకటవుతుంద’ని ప్రముఖ సినీ హాస్య నటుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. గోషా మహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘తాగే హక్కు మీకున్నా... మీ శరీరం కృశించిపోయేలా చేసుకునే హక్కు మీకు లేదు. మీపై ఆధాపడిన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు మీరు వస్తారని ఆశిస్తుంటారు. మీరు తాగి... ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబం రోడ్డున పడుతుంద ’ని హెచ్చరించారు. ఎదురుగా వస్తున్న వ్యక్తులు ఏ పరిస్థితుల్లో ఉంటారో... ఎవరి కుటుంబం రోడ్డున పడుతుందో చెప్పలేమన్నారు. తాగినప్పుడు శరీరం మన ఆధీనంలో ఉండదని... అటువంటి సమయంలో ప్రమాదం తప్పదన్నారు.
‘మా అబ్బాయి కారులో వస్తూ... తాగి చనిపోతే మరిచిపోయేవాడిని. కానీ రోడ్డు దాటుతున్న చిన్నారిని తప్పించే ప్రయత్నంలో కారు అదుపుతప్పి తలకు డివైడర్ తగిలి చనిపోయాడ’ని కొడుకు మరణాన్ని తలచుకొని బాబూమోహన్ కంటతడి పెట్టారు. బైకులు, కార్లు అతివేగంగా నడపడం నేరమని.. ప్రమాదంలో కుటుంబాన్ని పోషించాల్సిన మీరే అంగవైకల్యంతో ఇంట్లో పడితే ఆ భారం ఎవరు మోస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్, ప్రముఖ దర్శకుడు వేముగంటి, గోషామహల్ ట్రాఫిక్ ఏసీపీ జైపాల్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, హరినాథ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.