వరకట్న వేధింపులు తాళలేక...
వరకట్న వేధింపులు భరించలేక నవవధువు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
అమీర్‌పేట: వరకట్న వేధింపులు భరించలేక నవవధువు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌సపెక్టర్ వహీదుద్దీన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంకు చెందిన బ్రహ్మయ్య కూతురు భార్గవి(25)కి విజయవాడకు చెందిన నరేంద్రతో 9 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో నరేంద్రకు రూ.25 లక్షల నగదు, 20 తులాల బంగారం ఆధిబట్లలో ఓ ప్లాట్ కానుకగా ఇచ్చారు. భార్గవి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుండగా, నరేంద్ర మధురానగర్‌లోని వామన కన్సల్టెన్సీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తూ..రాజీవ్‌నగర్ స్వర్ణపురి కాలనీలో ఉంటున్నారు.
అదనపు కట్నం కోసం నరేంద్ర భార్గవిని వేధిస్తూ రావడంతో ఆమె తల్లిదండ్రులు నెలరోజుల క్రితమే మరో రూ.5 లక్షలు ఇచ్చారు. అయినా అతను వేధింపులు మానకపోవడంతో మనస్థాపం చెందిన భార్గవి సోమవారం ఉదయం చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమీపంలోనే ఉంటున్న బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపులు తట్టగా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు విరగొట్టి లోపలకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె భర్త నరేంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.