ఇందిరాభవన్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు
హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి వేడుకలు ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో శుక్రవారం ఇందిరాభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఎంతో ఆప్తుడని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలతో పాటూ సోనియా గాంధీతో కూడా ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ధికి వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారని దురదృష్టవశాత్తు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం బాధాకరమన్నారు.
సమైఖ్య రాష్ట్రంలో వేల మైళ్లు కాలినడకన ప్రయాణించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని మేమున్నామంటూ అభివృద్ధి ఫలాలను ప్రవేశ పెట్టిన మహానేత వైఎస్ అని మాదాసు గంగాధరం కొనియాడారు. పాదయాత్రలో భాగంగా రాజమండ్రిలో అస్వస్థతకు గురయితే ఒక డాక్టర్ అయి ఉండి కూడా వెనుతిరగకుండా, మడమతిప్పకుండా అస్వస్థతతోనే తన పాదయాత్ర కొనసాగించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాలన తర్వాత ప్రజలందరూ ఆయన పాలనే కావాలని కోరుకున్నారని గుర్తు చేశారు.
ఏపీసీసీ ఉపాధ్యక్షులు డా.మాదాసు గంగాధరం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి, సూర్యానాయక్, లీగల్ సెల్ ఛైర్మన్ సుందరరామ శర్మ, కిసాన్ సెల్ ఛైర్మన్ రవిచంద్రారెడ్డి, ఆర్టీఏ ఛైర్మన్ లక్ష్మినారాయణలతోపాటు ఇతర ఏపీసీసీ కాంగ్రెస్ నెతలు, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కలతో పాటూ టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.