డెడ్లీ..డ్రైవింగ్‌ | drunk and drive | Sakshi
Sakshi News home page

డెడ్లీ..డ్రైవింగ్‌

Published Mon, Oct 3 2016 11:28 PM | Last Updated on Fri, May 25 2018 2:57 PM

drunk and drive

► డ్రంకన్‌ డ్రైవింగ్‌లతో పరేషాన్‌
► మందు బాబుల దూకుడు.. 
మందు బాబుల దూకుడు.. 
వరుస ఘటనలతో పోలీసులకు సవాల్‌
 
 
సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో తూలుతూ.. వాహనాలు నడుపుతున్న మందుబాబుల దూకుడుతో జనం ప్రాణాలు గాలిలో దీపంలా మారుతున్నాయి. మద్యం మత్తులో కారు నడిపి ఇటీవల నగరం నడిబొడ్డున పంజగుట్టలో చిన్నారి రమ్య ప్రాణాలను బలిగొన్న ఉదంతం మరవక ముందే..తాజాగా పెద్ద అంబర్‌పేట్‌ వద్ద ఆదివారం రాత్రి మద్యం మత్తులో కారు నడిపిన ముగ్గురు యువకులు సంజన(5)అనే చిన్నారిని తీవ్ర గాయాలపాలుచేసి పారిపోవడం ఆందోళనకు గురిచేసింది. పవిత్రమైన గాంధీజయంతి రోజునే ఈ ఘటన జరగడం సిటీజన్లను కలచివేసింది. తాగి వాహనాలను నడపరాదని, 21 ఏళ్లలోపున్న యువకులకు మద్యం విక్రయించరాదని నిబంధనలున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. యువత దూకుడుకు కళ్లెం వేయలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో ట్రాఫిక్‌ పోలీసులు పట్టపగలు కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ మందుబాబుల ఆగడాలకు చెక్‌పడడంలేదు. మహానగరంలో నిత్యం సుమారు 46 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాక బయటి ప్రాంతాలనుంచి సుమారు 5 లక్షల వాహనాలు నగర రహదారులను ముంచెత్తుతాయి. ఇందులో అరకొర డ్రైవింగ్‌ నైపుణ్యం ఉన్న యువత శాతం 30 శాతానికి పైమాటే. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
 
మత్తు దిగక..ముంచుకొస్తున్న ముప్పు!
ప్రధానంగా 18–30 ఏళ్ల మధ్యన ఉన్న యువత మద్యం సేవించిన తరవాత మితిమీరిన వేగంతో కార్లు, ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. ఎదురుగా మనుషులు, జంతువులు, వాహనాలు వచ్చినా డ్రైవింగ్‌ వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. కాగా కొందరు మిత్రులతో పందెం కాసి వేగంగా వెళుతుండగా..మరికొందరు రహదారులపై పలు వాహనాలను ఓవర్‌టేక్‌ చేయడం ద్వారా తామే అందరికన్నా మిన్న అని చాటుకునేందుకు మితిమీరిన వేగంతో వెళుతున్నారు. మరికొందరు త్వరగా గమ్యస్థానాలకు చేరే క్రమంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఒకచేత్తో స్టీరింగ్‌..మరో చేత్తే మద్యం సీసాలు పట్టుకొని పాటలు వింటూ..మిత్రులతో పిచ్చాపాటీగా మాట్లాడుకుంటూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తున్న మందుబాబులు సైతం అమాయకుల ఉసురు తీస్తుండడం పలువురి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. 
కళ్లుండీ చూడలేని యంత్రాంగం..
మితిమీరిన వేగంతో వెళ్లేవారు..మద్యం మత్తులో ప్రధాన రహదారులపై దూసుకెళుతున్నప్పటికీ ఆర్టీఏ, ట్రాఫిక్, పోలీసు, ఆబ్కారీ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలోకి ప్రవేశించే ప్రతి ప్రధాన రహదారిపై విధిగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మందుబాబులు, లైసెన్సులేనివారు, మితిమీరిన వేగంతో వెళ్లేవారిని కట్టడిచేయడంలో ఆయా విభాగాల అధికారులు విఫలమౌతున్నారని వరుస ప్రమాదాలు రుజువు చేస్తున్నాయి. మరోవైపు కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కుతున్నా రవాణాశాఖ అధికారులు చోద్యం చూస్తుండడం ప్రమాదాలకు కారణమవుతోంది.
 
తాగి నడిపితే లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తాం...
మద్యం సేవించి వాహనాలు నడిపితే మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేస్తాం. ఇప్పటికే నగరంలో వెయ్యికి పైగా డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేశాం. వరుసగా పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. లైసెన్సు సస్పెన్షన్‌లో ఉండి కూడా మద్యం సేవించి వాహనాలను నడిపితే ఆయా వ్యక్తుల లైసెన్సులను రద్దు చేస్తాం.  
                                                                                            -– రఘునాథ్, జేటీసీ, హైదరాబాద్‌ 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement