ఉదయమూ ఊదాల్సిందే! | Drunk and drive also at day times too | Sakshi
Sakshi News home page

ఉదయమూ ఊదాల్సిందే!

Published Thu, Jan 11 2018 3:13 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

Drunk and drive also at day times too - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు లేకపోవడంతో మద్యం బాబులకు అదుపు లేకుండా పోయింది. ఇది పలు ప్రమాదాలకు దారితీస్తుండటంతో ఇలాంటి మందు బాబులకూ చెక్‌పెట్టాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. దీని కోసం ఏళ్లుగా అమలులో ఉన్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విధివిధానాల్లో మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలో పగలు, సాయంత్రం వేళల్లోనూ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. బుధవారం నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంలో ప్రధానంగా జంక్షన్లపై దృష్టి పెడుతున్నారు. ఈ మేరకు డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.  

వాహనదారుల వ్యతిరేకతతో... 
గతంలో అప్పుడప్పుడు పగటి పూట సైతం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడటంతో పాటు రికార్డులకు ఎక్కని అనేక చిన్న చిన్న ప్రమాదాలూ చోటు చేసుకున్నాయి. వాహనదారుల నుంచి కొంత వరకు వ్యతిరేకత సైతం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం నగర ట్రాఫిక్‌ పోలీసులు పగటిపూట డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను ఉపసంహరించుకున్నారు.  

జంక్షన్లలో సాయంత్రం వేళ... 
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు తాజాగా సాయంత్రం వేళల్లో ఈ డ్రైవ్స్‌ చేపట్టాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఓ ప్రాంతంలో ఏర్పాటు చేయడం కాకుండా జంక్షన్ల వద్దే దృష్టి పెట్టారు. ఎంపిక చేసుకున్న చౌరస్తాల్లో రెండు మూడు బృందాలు ఈ తనిఖీలు చేపడతాయి. ప్రతి బృందానికీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి, చెస్ట్‌ మౌంటెడ్‌ కెమెరా ధరించి నేతృత్వం వహిస్తారు. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు నిర్వహించకుండా ఓ జంక్షన్‌లో ఉండే నాలుగైదు మార్గాలతో పాటు నిర్ణీత సమయం తర్వాత ఆ జంక్షన్‌ను సైతం మారుస్తూ ఈ తనిఖీలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి వెస్ట్‌ డిస్ట్రిక్ట్‌ పరిధిలో ఈ కొత్త విధానం అవలంబిస్తున్నారు. ఈ తనిఖీలను ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.  

ప్రమాదాలకు తావు లేకుండా... 
ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ చౌరస్తాలో ముందు వరుసలో ఆగిన వాహనదారులను తనిఖీ చేయవద్దని స్పష్టం చేశారు. స్టాఫ్‌లైన్‌ నుంచి కనీసం ఐదు మీటర్లు వదిలి అక్కడి వరుసల్లో ఉన్న వాహనాలను తనిఖీ చేస్తారు. ఎవరైనా మద్యం తాగినట్లు శ్వాసపరీక్ష యంత్రం గుర్తిస్తే వారిని వాహనంతో సహా పక్కకు తీసుకువచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు. ట్రాఫిక్‌ జామ్స్‌కు ఆస్కారం లేకుండా కేవలం సిగ్నల్‌లో రెడ్‌ లైట్‌ నుంచి గ్రీన్‌ లైట్‌ వచ్చే మధ్యలోనే ఈ తనిఖీలు చేపట్టనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement