
డ్రంక్ అండ్ డ్రైవ్ లో యువకుడి వీరంగం
హైదరాబాద్ : శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఆశిష్ చోప్రా సింగ్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఐపీఎస్ అధికారిణి బంధువునంటూ మీడియా సిబ్బందిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన పోలీసుల మీద కూడా దాడికి పాల్పడ్డాడు. నోటికి వచ్చినట్లు తిడుతూ చిందులు వేశాడు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద శనివారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరు కార్లను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిణి తేజ్‌దీప్‌కౌర్ బంధువునంటూ సదరు వ్యక్తి హల్‌చల్ చేశాడు. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు బ్రీత్ ఎనలైజర్ ద్వారా గుర్తించారు. అతగాడి వీరంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై దాడికి దిగాడు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ చిందులు వేశాడు. కాగా దాడికి పాల్పడిన అశిష్ చోప్రాసింగ్పై జర్నలిస్టులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు.