=నిత్యం కుటుంబాలకు దూరం
=వెంటాడుతున్న అనారోగ్యం
=అనేక మందిలో కనిపించని కృత జ్ఞత
=నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
సాక్షి,సిటీబ్యూరో: శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులే అత్యంత కీలకం. ఒక్కరోజు పోలీసు అనే వ్యక్తి లేకుంటే ఊహించడం చాలాకష్టం. అలాంటి పోలీసులు విధినిర్వహణలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే అయినా ప్రజ లకు సంబంధించి విధి కావడంతో ఎప్పుడు,ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి. అయితే పోలీసుల పరిస్థితి జంటకమిషరేట్లలో ఏంటో తెలుసా..? అరకొర సిబ్బంది, వేళాపాళా లేని విధులు, నిత్యం తన వారికి దూరంగా.. అనారోగ్యాలకు దగ్గరగా, పండుగలు, పబ్బాలు రోడ్లమీదే. అక్టోబర్ 21..పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఏడాదికాలంలో విధినిర్వహణలో ప్రాణాలు అర్పించి త్యాగధనులుగా మారిన అధికారులు, సిబ్బందిని స్మరించుకోవడం కోసం దీన్ని నిర్వహిస్తారు. కేవలం వీరు మాత్రమే కాదు...వాస్తవంగా చెప్పాలంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పనిచేసే ప్రతి పోలీసు త్యాగధనుడే.
సర్వకాల సర్వావస్థల్లోనూ : నగరం మొత్తం ఆదమరిచి నిద్రిస్తున్న రాత్రివేళ కాపుకాయడానికి ప్రతిరాత్రీ 1400 మంది పోలీసులు మేల్కొనే ఉంటారు. గస్తీ తిరుగుతూ నగరాన్ని కంటికిరెప్పలా కాపాడుతుంటారు. పండుగలు, పబ్బాలు వచ్చిన సందర్భంలో నగరం దాదాపు సగంఖాళీ అవుతుంది. అదే సమయంలో నగర పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది మొత్తం ‘స్టాండ్‌టూ’లో ఉంటూ... కుటుంబాన్ని వదిలి విధినిర్వహణ కోసం 24 గంటలు పోలీసుస్టేషన్‌కే అంకితం అవుతారు. ఇటీవల పరిస్థితులే తీసుకుంటే జూలై నుంచి నేటివరకు కంటి నిండా నిద్రపోయిన పోలీసు అంటూ లేరు. రంజాన్ మాసం,గణేష్ ఉత్సవాలు, నిరసనలు, దసరా నవరాత్రులు ఇలా వరుసపెట్టి బందోబస్తులతో కమిషనరేట్ పరిధిలోని ప్రతిఅధికారి విధుల్లోనే ఉన్నారు. ఇది కేవలం మచ్చుతునక మాత్రమే. ఇక ట్రాఫిక్ పోలీసులు విధుల గురించి తెలియని వారుండరు.
వెంటాడే అనారోగ్యం : పోలీసులకు విధి నిర్వహణలో ఎదురయ్యే మరో పెను ఉపద్రవం అనారోగ్యం. వేళాపాళాలేని విధులు..కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండిలేని దుస్థితి వెరసి అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోం ది. రాష్ట్రంలో ఏటా అనారోగ్యానికిలోనై ప్రాణాలు వదులుతున్న వారిలో కిందిస్థాయి వారే ఎక్కువ. రాష్ట్రం మొత్తమ్మీద ఏటా 500మంది సిబ్బంది మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇక రోగులుగా మారి చికిత్సలు చేయించుకుంటూ నరకం అనుభవిస్తున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ట్రాఫిక్ పోలీసులకు ఇక శ్వాసకోస వ్యాధులు అధికం.
ఆ స్థాయి గుర్తింపు శూన్యం : అనునిత్యం విధులకే అంకితమవుతూ మన కోసం, జనం కోసం కాపుకాస్తున్న పోలీసు త్యాగాలకు సరైన గుర్తింపు మాత్రం లభించట్లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. ‘జీవితంలో కనీసం ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లని వారికంటే...కనీసం ఒక్కసారైనా వారి వద్దకు వెళ్లిన వారికే పోలీసులంటే సదాభిప్రాయం ఉంటోంది’ అనేక అంతర్జాతీయ సర్వేలు చెప్పిన వాస్తవమిది. అయితే సమాజంలో దాదాపు 60 శాతం మందికి వారి జీవితంలో ఒక్కసారి కూడా పోలీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గడిచిపోతోంది. మరోపక్క పోలీసుస్టేషన్లకు వస్తున్న వారు సైతం ‘అధికారభాష’, ప్రవర్తనా తీరుతో ఉన్న సదాభిప్రాయాన్ని కోల్పోతున్నారు. వీటన్నింటికీ మించి పోలీసు విభాగంలో చోటు చేసుకునే చిన్నచిన్న తప్పులు, అపశ్రుతులు వల్ల వారు సమాజానికి మరితం దూరమవుతున్నారు.
‘అదుపు’ తప్పుతున్నారు : ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న మన పోలీసులు అనేక సందర్భాల్లో ‘అదుపు’ తప్పుతున్నారు. సహనాన్ని కోల్పోయి ఉన్నతాధికారులపై తిరగబడటం, దాడులు చేయడం జరుగుతోంది. ఈ ఒత్తిడికితోడు నిత్యం కుటుంబానికి దూరంగా ఉండటం, వారిని నిర్లక్ష్యం చేయడంతో కొన్ని చిన్నచిన్న కుటుంబసమస్యలను తట్టుకునే మానసిక పరిపక్వతను కోల్పోతున్నారు.