నల్లకుంట: ఐదేళ్ల చిన్నారిని అగంతుకురాలు కిడ్నాప్ చేసి.. చెవి దుద్దులు తీసుకొని విడిచి పెట్టింది. నల్లకుంట ఇన్‌స్పెక్టర్ యాదగిరి రెడ్డి కథనం ప్రకారం... అడిక్‌మెట్ వడ్డెర బస్తీలోని ప్రభుత్వ బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పని చేస్తున్న వి.దివ్యకు కుమార్తె వి.హర్షిత (5), కుమారుడు భానుప్రసాద్ (7) సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో హర్షిత ఒకటో తరగతి, భానుప్రసాద్ రెండో తరగతి చదువుతున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న హర్షిత అన్నతో కలిసి అక్కడే ఆడుకుంటుండగా... ఉదయం 11 గంటలకు గుర్తు తెలియని మహిళ వారి వద్దకు వచ్చింది. చాక్లెట్లు కొనిపెడతానని హర్షితను తీసుకెళ్లింది. ఆకలి వేస్తుండటంతో కొద్ది సేపటికి భాను ప్రసాద్ తల్లి వద్దకు వెళ్లాడు. చెల్లి ఎక్కడ ఉందని తల్లి అడగగా... చీరకట్టుకొని వచ్చిన ఓ అక్క చాక్లెట్ కొనిపెడతానని చెల్లిని తీసుకెళ్లిందని చెప్పాడు. వెంటనే తల్లి పాఠశాల వద్దకు వెళ్లి ఆరా తీయగా హర్షిత ఆచూకీ తెలియకపోవడంతో మధ్యాహ్నం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని ఠాణాలకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా... హర్షితను కిడ్నాప్ చేసిన మహిళ ఆ చిన్నారి చెవులకు ఉన్న గ్రాము బంగారు దుద్దులు తీసుకుని మధ్యాహ్నం అంబర్‌పేట మహంకాళి ఆలయం వద్ద వదిలి వెళ్లింది. అక్కడ ఏడుస్తూ కూర్చున్న చిన్నారిని స్థానికులు అంబర్‌పేట ఠాణాలో అప్పగించారు. అప్పటికే నల్లకుంట పీఎస్‌లో చిన్నారి మిస్సింగ్ కేసు నమోదైన విషయం తెలిసి అంబర్‌పేట పోలీసులు వారిని సంప్రదించి.. ఈ బాలికే అక్కడ అదృశ్యమైన హర్షితగా నిర్థారించుకున్నారు. అనంతరం నల్లకుంట పోలీసులు హర్షితను తీసుకెళ్లి తల్లి దివ్యకు అప్పగించారు. కాగా, బాలికను కిడ్నాప్ చేసిన అగంతకురాలి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.