టచ్ అండ్ గో!
ఓఆర్‌ఆర్‌పై ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్
కార్డులతో చెల్లింపులు... ఆటోమేటిక్ ఎగ్జిట్
వాహనదారులకు సమయం ఆదా..
భారీ క్యూలకు ఇక చెక్
సిటీబ్యూరో: అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై టోల్ వసూళ్లను సమర్థంగా నిర్వహించడంతో పాటు వాహనదారులకు సౌలభ్యంగా ఉండేందుకు హెచ్‌ఎండీఏ సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తోంది. ఇప్పటివరకు టోల్‌ప్లాజాల వద్ద డబ్బులిచ్చే పద్ధతికి స్వస్తి పలికి ఆ స్థానంలో ఏటీఎం కార్డు మాదిరిగానే ఉండే ‘టచ్ అండ్ గో’ కార్డు, ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) కార్డులను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కార్లు, లారీలతో పాటు ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ఈ కార్డులను కొనుగోలు చేసేందుకు టోల్ ప్లాజా కార్యాలయాల వద్ద పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రయాణించిన దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేసే టోల్ సిస్టమ్ త్వరలోనే కనుమరుగుకానుంది. దేశంలోనే తొలిసారిగా డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (డీఎస్‌ఆర్‌సీ) ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జారీ చేయనున్న ఈ కార్డుల వినియోగం ద్వారా వాహనదారుల జర్నీ సమయం చాలా ఆదా కానుంది.
టచ్ చేసి వెళ్లడమే...
156.8 కిలోమీటర్లున్న ఓఆర్‌ఆర్‌పై 19 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటన్నింటిని దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు చాలా సమయం పడుతోంది. టోల్‌ప్లాజాల వద్ద ఒక్కోసారి వాహనాల రద్దీ ఎక్కువై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో వారి సమయం చాలా వృథా కావడంతో పాటు వాహనదారుల నుంచి డబ్బులు తీసుకొని రశీదు ఇచ్చి పంపడం కూడా సిబ్బందికి భారంగా మారుతోంది. టోల్ వసూళ్లలో పారదర్శకత తీసుకరావడంతో పాటు వాహనదారుల ప్రయాణం సౌలభ్యంగా ఉండేందుకోసం ‘టచ్ అండ్ గో’ కార్డును పరిచయం చేస్తున్నారు. ఈ కార్డును తీసుకున్న వాహనదారుడు 157 మాన్యువుల్, టంచ్ అండ్ గో లేన్స్‌లో వెళ్లవచ్చు. తమ కార్డును టోల్‌ప్లాజా వద్ద ఉండే స్క్రీన్‌కు చూపించి ముందుకెళ్లాలి. అలా చూపడం వల్ల ఆ కార్డులో ఉండే నగదును ఆ సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. దాదాపు రూ.200లకే అందుబాటులోకి తీసుకురానున్న ఈ కార్డులో టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటుచేసే పీవోసీలో రీచార్జ్ చేసుకునే వీలును కలిపించారు. భవిష్యత్‌లో మొబైల్ రీచార్జ్ సేవలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
‘యాంటీనా’ ద్వారా క్లియరెన్స్
టచ్ అండ్ గో మాదిరిగానే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ) కార్డు కూడా పనిచేస్తుంది. ఓఆర్‌ఆర్‌లో ఈటీసీ కార్డును వినియోగించే వాహనాలను 23 లేన్లలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ లేన్లోకి ఎంట్రీ అయ్యే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటుచేసిన తొలి యాంటీనా... కార్డు వ్యాలిడ్ కాదా అవునా.. అని గుర్తిస్తుంది. అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్ దానంతట అదే తెరుచుకుంటుంది. ఆ తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్‌ఆర్ ఎక్కిందో రికార్డు చేసుకుంటుంది. అది ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ టోల్‌బూత్ నుంచి నిష్క్రమించగానే ఆ కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఈటీసీ టెక్నాలజీని జపాన్ నుంచి వినియోగించుకుంటున్నారు. ఈటీసీ కార్డుకు దాదాపు రూ.2,000 వరకు చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు అంటున్నారు. ఈ కార్డులను కూడా టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటుచేసే పీవోసీలో రీచార్జ్ చేసుకునే వీలును కలిపించారు. నానక్‌రామ్‌గూడలో ఏర్పాటుచేయనున్న ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ సేవలను అనునిత్యం అధికారులు పర్యవేక్షించనున్నారు.