బ్యాంకులో జమచేయమని ఇచ్చిన డబ్బుతో ఓ ఉద్యోగి కనిపించకుండా పోయాడు.
హైదరాబాద్: యజమాని బ్యాంకులో జమ చేయాలని చెప్పి ఇచ్చిన నాలుగున్నర లక్షల రూపాయలతో ఓ ఉద్యోగి కనిపించకుండా పోయాడు. ఎల్బీనగర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
ఓ ఏజెన్సీలో పనిచేస్తున్న జంగ సంజయ్ అనే ఉద్యోగికి అతని యజమాని కృష్ణకుమార్ రూ. 4.53 లక్షల డబ్బు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలని పురమాయించాడు. అయితే, సంజయ్ ఆ మొత్తాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా కారులో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడే సిద్ధంగా ఉన్న ఓ రైలు ఎక్కి ఎటో వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన వాడని, కర్ణాటక లేదా ఢిల్లీ పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.