మీడియాతో మాట్లాడుతున్న జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్. చిత్రంలో విడుదలైన ఖైదీ సోని
* ప్రణాళిక సిద్ధం చేసిన జైళ్ల శాఖ
* పలు ప్రైవేటు కంపెనీలతో అవగాహనా ఒప్పందం
* వచ్చే 15 ఏళ్లలో 10 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ పూచీకత్తుగా విడుదలైన ఖైదీలకు ఆ శాఖ భాగస్వామ్యంతో పనిచేసే ప్రైవేటు కంపెనీలలోనూ 25 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. శనివారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 91 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వచ్చే 15 ఏళ్లలో పదివేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
జైళ్ల శాఖ వస్తువులకు భారీ డిమాండ్..
జైళ్ల శాఖ ఆధ్వర్యంలో తయారయ్యే వస్తూత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటోంది. నాణ్యతతో కూడిన వస్తువులు కావడంతో విద్యాశాఖ తమ ఫర్నిచర్ కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జైళ్లల్లో ఖైదీలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, నేచురల్ స్పా, కుట్లు, అల్లికలు, ఫర్నిచర్, స్టీల్ సామగ్రి తయారీలో శిక్షణనిచ్చి మూడుషిప్టుల్లో పనిచేయిస్తున్నారు. పెట్రోల్‌బంకుల లాభాల బాట పట్టడంతో కొత్తగా మరో మూడు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది జైళ్లశాఖ వివిధ మార్గాల ద్వారా రూ.4.42 కోట్ల లాభాలను ఆర్జించింది.
నెలకు రూ. 8 వేలు ఇస్తున్నారు: మనోజ్‌కుమార్ సోని, విడుదలైన ఖైదీ
పదేళ్లలో ఇప్పటి వరకు 16 సార్లు జైలుకు వెళ్లాను. చాలాసార్లు చేయని నేరానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఖైదీ అనే ముద్ర పడటంతో ఎక్కడా ఉపాధి లభించలేదు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోనే నాలుగు కేసులు నమోదు చేశారు. ఇన్‌ఫార్మర్‌గా మారాలని లేకపోతే పీడీయాక్టు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులకు చెబితే వారే ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు రూ.ఎనిమిది వేలు ఇస్తున్నారు.