
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నిజాంపేటలో చోటుచేసుకుంది. గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజాంపేటలోని త్రివేణి హాస్టల్లో ఉంటున్న ఆమె ఇవాళ సాయంత్రం ఈ ఘటనకు పాల్పడింది. శ్రావణి స్వస్థలం ఖమ్మం జిల్లా. కాగా ఇంటి మీద బెంగతోనే తమ కుమార్తె ఈ ఘటనకు పాల్పడిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మరోవైపు శ్రావణి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే అని సమాచారం. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తన చావుకు ఎవరూ కారణం కాదని, ఇంటిపై బెంగతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రావణి సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.