సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, కొత్త రాష్ట్రమైనా దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు శాతంగా ఉన్న తెలంగాణ ప్రాంత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి 2016–17 నాటికి 8.6 శాతానికి పెరిగిందని.. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువని తెలిపారు. సోమవారం రాష్ట్ర శాసనమండలి, శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. శాసనసభ సమావేశాలు నిర్మాణాత్మకంగా జరుగుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇరవై నిమిషాల పాటు ఇంగ్లిష్‌లో మాట్లాడిన ఆయన.. చివరిలో కొద్దిసేపు తెలుగులో మాట్లాడి, ‘ఓం సర్వే భవంతు సుఖినాః.. సర్వే సంతు నిరామయః’అనే శ్లోకంతో ప్రసంగాన్ని ముగించారు. గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
బంగారు తెలంగాణ దిశగా..
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కోటి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టాం. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాం.
ఉత్తమ పారిశ్రామిక విధానంతో..
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం. టీఎస్ ఐపాస్‌తో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. ఈ విధానంతో రాష్ట్రానికి 1.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ కేం ద్రంగా మారింది. టీ–హబ్‌తో స్టార్టప్‌లను ప్రో త్సహిస్తున్నాం. టీహబ్–2ను ప్రారంభిస్తాం.
ప్రభుత్వ వైద్యానికి చేయూత
కేసీఆర్ కిట్ పథకానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇది అమల్లోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 33 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయి. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమా న్ని ప్రారంభించాం. నాణ్యమైన విద్య అందించేందుకు 517 గురుకులాలు ప్రారంభించాం. ఎస్టీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాం.
రహదారుల అభివృద్ధికి చర్యలు
ప్రభుత్వం రవాణా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జాతీయ రహదారులను జిల్లా, మండల రహదారులతో అనుసంధానం చేస్తు న్నాం. గతేడాది హైదరాబాద్ మెట్రోరైల్ కూడా ప్రారంభమైంది. పీపీపీ పద్ధతిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు తొలిదశలో 30 కిలోమీటర్ల మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
తెలుగు భాషను, సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెలుగు ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం తెలుగు భాష, సాహిత్యాన్ని చాటింది. 8 వేల మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించే దిశగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. ఉభయ సభల్లో చర్చలు మన ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని ఆశిస్తున్నా..’’
రైతుల సంక్షేమానికి చర్యలు
రాష్ట్రంలో అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అందువల్లే ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది. 23 లక్షల పంపుసెట్లకు నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. త్వరలో కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతమైంది.
ఈ రికార్డుల సమాచారంతో త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నాం. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం విజయవంతంగా సాగుతోంది. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తున్నాం. గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. విద్యుత్ రంగంలో ప్రగతి సాధించాం. పరిశ్రమలకు పవర్ హాలిడేలను ఎత్తివేశాం. సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే ముందున్నాం.
Comments
Please login to add a commentAdd a comment