సమాజ సేవలో భాగస్వాములు కావాలి
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు గవర్నర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ‘అదృష్టమో.. దురదృష్టమో.. రాష్ట్రం రెండుగా విడిపోయింది. అయినప్పటికీ రెండు రాష్ట్రాల స్కౌట్స్ అండ్ గైడ్స్ క్రమశిక్షణ, అంకితభావంతో పని చేస్తూ, స్వతంత్రంగా ఎదగాలి’ అని ఇరురాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. బుధవారం ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామన్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ అభియాన్, డి అడిక్షన్ వంటి కార్యక్రమాలు స్కౌట్స్ అండ్ గైడ్స్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కనీసం నెలకు ఒక కార్యక్రమంలోనైనా స్కాట్స్ అండ్ గైడ్స్ పాల్గొనాలన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ప్రతిభ కనబరిచే వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. వచ్చే సమావేశం నాటికి ఇరు రాష్ట్రాల వారు గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి తమ సత్తా చూపాలని కోరారు.
పదవీ విరమణ చేసిన వారు యువతను జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ చెప్పారు. ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రమే కాదు స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం కూడా సామరస్యంగానే విడిపోయిందన్నారు. రెండు ప్రాంతాల్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధిలో గవర్నర్ ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలంగాణలోని విద్యార్థులను పాఠ శాల దశ నుంచే స్కౌట్స్ అండ్ గైడ్స్ వైపు ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిషనర్ స్కౌట్స్ ఎస్ బాలసుబ్రమణ్యం, కామన్ అడ్మినిస్ట్రేటర్ కేవీ మిశ్రాలు మాట్లాడారు. అనంతరం గవర్నర్ చేతుల మీదుగా జిల్లాల్లో సేవా కార్యక్రమాల్లో ముందు నిలిచిన పలువురికి జిల్లాల వారిగా గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ చేత గవర్నర్ నరసింహన్ శాంతి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ అండ్ జీ ఏపీ అధికారి ఆర్‌కే శశిధర్, బీఎస్ అండ్ జీ అధికారులు సంధ్యారాణి, ఎ.చంద్రశేఖర్‌లతో పాటు జిల్లాల కమిషనర్లు పాల్గొన్నారు.