‘పట్నా’నికి వరాలజల్లు
సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు
నక్షత్రశాల పరిరక్షణ,విద్యాసంస్థల విస్తరణ
ముఖ్యమంత్రి కేసీఆర్
రంగారెడ్డి జిల్లా: సీఎం కేసీఆర్ మండువేసవిలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. సీఎం వరాలపై సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయి. సోమవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్థానిక అవసరాలు ప్రస్తావిస్తూ..వాటి పరిష్కారం క్రమంలో ఒక్కొక్కటిగా వరాలు కురిపించారు.
నాలుగు లేన్ల రోడ్లు.. వీధి దీపాలు..
‘ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం వరకే నాలుగు లేన్ల రోడ్డుంది. దీన్ని మాల్ వరకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటా. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించేలా.. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు సెంట్రలైజ్ట్ లైట్లను ఏర్పాటు చేసేలా ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా. నిశ్చింతగా ప్రయాణం చేయొచ్చు.. కృష్ణా మడ్డీ నీటితో ఇబ్రహీంపట్నం చెరువును నింపే యోచనలో ఉన్నాం’ అని సీఎం పేర్కొన్నారు. మంచాల మండలంలోని జాపాల నక్షత్ర శాల స్థలంలో గజం భూమి కూడా ఎవరికీ కేటాయించబోమని తెలిపారు. అదంతా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉంటుందని వివరించారు.