రేసులో గీతారెడ్డి, జీవన్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పదవి ఖాళీ అవటంతో మాజీమంత్రులు గీతారెడ్డి, జీవన్ రెడ్డి ఆ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీమంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే కిష్ణారెడ్డికి పీఏసీ చైర్మన్ పదవి వరించింది. అయితే అనారోగ్యంతో ఆయన మృతి చెందటంతో ఆ స్థానంలో రాంరెడ్డి వెంకటరెడ్డి నియమితులయ్యారు. దీంతో ఆయన మృతితో మరోసారి ఆ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలకు గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది.
మరోవైపు మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి డీకె అరుణ కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు నేతల్లో పీఏసీ పదవి ఎవర్ని వరిస్తుందో చూడాలి. కాగా సాధారణంగా శాసనసభలో పీఏసీ చైర్మన్‌గా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేను నియమించడం అనవాయితీ.