కామన్ కౌన్సెలింగ్‌పై నిపుణుల సలహా!
దీనిపై సూచనలివ్వాలని ఏజీని కోరిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, వైద్య పీజీ సీట్ల భర్తీ కోసం కామన్ కౌన్సెలింగ్‌పై నిపుణుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై సూచనలు ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్‌ను ప్రభుత్వం కోరింది. ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్‌తో పాటు వైద్య పీజీ సీట్లకూ కామన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని భారత వైద్య మండలి (ఎంసీఐ) రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం, కన్వీనర్ కోటాతో పాటు, మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరి), ఎన్‌ఆర్‌ఐ కోటా (సీ కేటగిరి) సీట్లతో పాటు మైనారిటీ కాలేజీల్లోని సీట్లనూ ప్రభుత్వమే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంపై ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇప్పటి వరకు కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వరకే ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. కామన్ కౌన్సెలింగ్ విధానం అమలులోకి వస్తే సీట్ల భర్తీలో ప్రైవేట్ కాలేజీల పాత్ర నామమాత్రం కానుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.