నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్
Published Wed, Jun 28 2017 2:16 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ కేంద్రంగా నాసిరకం విత్తనాలు తయారు చేసి విక్రయిస్తూ రైతులు జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాలివీ.. కాలం చెల్లిన విత్తనాలతో పాటు, నాసిరకం విత్తనాలను తయారు చేసి విక్రయిస్తున్నారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు ప్రదేశాల్లో దాడులు చేపట్టి నలుగురు సభ్యుల ముఠా చిన్నం జానకి రాం, సంఘి మహేందర్ , శ్రీను, లక్ష్మీ అనే వారిని అరెస్ట్ చేశారు.
సృష్టి, గోపీ కృష్ణ సీడ్స్ పేరుతో వీరు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో రైతులను మోసం చేశారు. తొర్రూర్‌లోని సృష్టి సీడ్స్ కంపెనీ నుంచి 1651 నకిలీ పత్తి విత్తనాల బ్యాగులను హయత్ నగర్ పొలీసులు సీజ్ చేశారు. అలాగే, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్‌లోని గోపీ కృష్ణ సీడ్స్ కంపెనీపై దాడి చేసి 2045 కేజీల పత్తి విత్తనాలను, నకిలీ కందులు 1050 కేజీలను సీజ్ చేశారు. వీటి విలువ 46 లక్షలుంటుంది. ఈ మేరకు నిందితులపై సీడ్ కంట్రోల్ యాక్ట్ కింద సెక్షన్ 420 , ఐపీసీ 13 (1), 18(1) కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన భూత్‌పూర్ ఎస్ఐ అశోక్ ను సస్పెండ్ చేశారు.
Advertisement
Advertisement