' మీ పిల్లలు చనిపోతే ఇలానే వ్యవహరిస్తారా'?
హైదరాబాద్:మహబూబ్ నగర్ జిల్లా పాలెం వోల్వో బస్సు ప్రమాద బాధితులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. బస్సు ప్రమాదం జరిగిన అనంతరం వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్న బొత్స ఇంటివద్ద నిరసన దిగారు. ఈ క్రమంలోనే శనివారం బొత్స ఇంటిని ముట్టడించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బొత్స వెంటనే తన మంత్రికి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ' మీ పిల్లలు చనిపోతే ఇలానే వ్యవహరిస్తారా'? అని బాధితులు ప్రశ్నించారు.
ప్రభుత్వ పెద్దలు ఎంతో విద్యావంతులని వారిని ఎన్నుకున్నామని, కనీసం పట్టించుకోకుండా కాలయాపన చేయడం సిగ్గు చేటని వారు మండిపడుతున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల అక్టోబర్ 30వ తేదీన వోల్వో బస్సు ప్రమాదం జరిగి 45 మంది అసువులు బాసారు. బస్సు ప్రమాదంపై అప్పట్లో గొప్పగా స్పందించిన ప్రభుత్వం..అనంతరం బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు.
దీంతో ఆగ్రహించిన బస్సు ప్రమాద బాధితులు బొత్స ఇంటిని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. అయితే వారు పోలీసు వ్యాన్ లో నుంచి కిందకు దిగకుండా తమ నిరసన తెలిపారు.