
తల్లిని చూడటానికి వెళ్లమని ఆదేశించండి
హెచ్చార్సీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తండ్రి ఫిర్యాదు
నాంపల్లి: ‘‘ఆస్తులు అమ్ముకొని.. చివరికి కూలీ పని చేసి ఉన్నత చదువులు చదివించాం... రెక్కలొచ్చాక మమ్మల్ని కాదని తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లో నా కుమారుడు పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చూస్తున్నాడు... మూడేళ్లుగా వాడి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు’’.. అని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న తన భార్య మంచాన పడిందని, కొడుకును చూడాలన్న ఆమె కోరిక తీరేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత తండ్రి ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాడు.
బాధితుడి కథన ప్రకారం.... కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా అరగినమర క్యాంపుకు చెందిన ఏరువ వెంకట్‌రెడ్డి, సాలమ్మలకు శ్రీనివాసరెడ్డి ఏకైక సంతానం. కుమారుడిని ఎంతో కష్టపడి చదివించారు. అతని చదువు కోసం వారికి ఉన్న చిన్న ఇంటిని, మూడు గేదెలను కూడా అమ్మేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. తర్వాత పెళ్లి చేయగా.. ఏడాది పాటు తల్లిదండ్రులను చూసేందుకు సొంతూరు వచ్చేవారు. తదనంతరం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పూర్తిగా మరిచిపోయాడు. తల్లి సాలమ్మ దిగులుతో అనారోగ్యం పాలైంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిందని ఫోన్ చేస్తే మీకు, నాకు ఎలాంటి సంబంధం లేదని ఫోన్ పెట్టేశాడు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి ఏం బాగాలేదని, కొడుకును చూడాలని కలవరిస్తోందని, ఎస్.ఆర్.నగర్ పోలీసుల ద్వారా కుమారుడికి తెలియజేస్తే.. వారు చనిపోయినా నాకు అనవసరం లేదని సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లిని చూడటానికి కుమారుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తండ్రి వెంకట్‌రెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను తన ఫిర్యాదులో కోరాడు.