
టీవీ చానళ్ల నియంత్రణకే ఫైబర్ గ్రిడ్
♦ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏది చూపించినా నిలిపేస్తారు
♦ బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకు పనులు ఎలా అప్పగించారు?
♦ వేమూరి, చంద్రబాబు సాన్నిహిత్యం బట్టబయలు
♦ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీవీ చానళ్లను నియంత్రించే ఉద్దేశంతోనే ఫైబర్ గ్రిడ్‌ను తీసుకొస్తున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏది చూపించినా, వెంటనే దాన్ని నిలిపివేసే కార్యక్రమమే ఫైబర్ గ్రిడ్ అని విమర్శించారు. ఫైబర్ గ్రిడ్‌పై శనివారం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. రూ.333 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్టును ఏ విధంగా ఇచ్చారో, ఇందులో రూ.వందల కోట్ల అవినీతి ఎలా జరిగిందో సభకు వివరించారు. చౌక ధరలదుకాణాల్లో ప్రవేశపెట్టిన ఈ-పాస్ అనే కార్యక్రమానికి యంత్రాలను అమర్చడంలో పూర్తిగా విఫలమైన టెరాసాఫ్ట్ సంస్థకు ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును అప్పగించిందని చెప్పారు. టెరాసాఫ్ట్ సంస్థను 2015 మే 11న బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, అదే సంస్థకు పనులు ఎలా అప్పగించారో చంద్రబాబే చెప్పాలని అన్నారు. టెరాసాఫ్ట్‌కు చెందిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌పై గతంలో ఈవీఎంను దొంగిలించినందుకు ముంబైలో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తుచేశారు.
చంద్రబాబు అవినీతిని ఎవరు నిర్మూలించాలి?
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనుల కోసం టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావించిందని, దీన్ని పర్యవేక్షించేందుకు 2015 ఆగస్టు 21న ఉన్నతస్థాయి కమిటీని వేసిందని వైఎస్ జగన్ తెలిపారు. అయితే, ఇందులో సభ్యుడిగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నా, ఆయన అనుబంధ సంస్థే టెరా సాఫ్ట్‌వేర్ అని వెల్లడించారు. పర్యవేక్షక కమిటీలో హరికృష్ణ ప్రసాద్ ఉండటం, ఆయనకు సంబంధించిన అనుబంధ సంస్థకే పనులు అప్పగించడం ఏవిధంగా సాధ్యమైందని ప్రశ్నించారు.
అదే విధంగా హెరిటేజ్ ఫుడ్స్‌లో డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ టెరాసాఫ్ట్‌లోనూ డెరైక్టర్‌గా పనిచేశారని, చంద్రబాబుకు సంబంధించిన సంస్థలో పని చేస్తున్న వారికే ఏవిధంగా కాంట్రాక్టు అప్పగించారని అన్నారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్, చంద్రబాబు కుటుంబం మధ్య గల సన్నిహిత సంబంధాలు తేటతెల్లమమవుతుంటే, ఈ రకంగా కాంట్రాక్టులు ఇచ్చేయడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నించారు. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. పేదవాడి ఇళ్ల కేటాయింపులోనో, పెన్షన్‌లోనో అవినీతి జరిగిందని, దాన్ని నిర్మూలిస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరుండి అవినీతి చేస్తుంటే ఎవరు నిర్మూలించాలని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బదులిస్తూ... ఈవీఎంలలో అవకతవకలను నిరూపించడానికి వేమూరి హరికృష్ణ ప్రసాద్ ప్రయత్నించారని చెప్పారు. అతి తక్కువ కోట్ చేసిన టెరాసాఫ్ట్‌కే టెండర్‌ను ఖరారు చేశామని, వేమూరి అప్రూవల్ కమిటీలో సభ్యుడు కాడని తెలిపారు.
ఇలా చేయొచ్చని చెప్పినవాళ్లే గొప్పా?
ఫైబర్ గ్రిడ్ వ్యవహారంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సుదీర్ఘ ఉపన్యాసంపై విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన వ్యంగ్యాస్త్రాలు సభలో ఆసక్తి కలిగించాయి. ఆయన మాటలు యథాతథంగా... ‘‘టెక్నాలజీ అంతా తానే అన్నట్టుగా, సెల్‌ఫోన్ ఏ మాదిరిగా పనిచేస్తుంది. సెల్‌ఫోన్‌లో యాప్‌లు మనం వేలుపెట్టి ఇలా... ఇలా... ఇలా... నొక్కాలి, దానివల్ల జరిగే మేలు ఏమిటి అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తావుంటే, ఆ సెల్‌ఫోన్‌ను కనిపెట్టినోడు, యాప్‌ను కనిపెట్టినోడు, ఆ యాప్‌ను సెల్‌ఫోన్‌లో పెట్టినోడు గొప్పనా... లేకపోతే ఇలా ఇలా చేయొచ్చు అని చెబుతా ఉన్న చంద్రబాబు నాయుడు గొప్పనా నాకు అర్థం కావడం లేదు. ఆయన ఏరకంగా చెబుతారు అని అంటే ఫోర్ డాష్ కోడ్ తాను పెట్టానని, ఇంతకు ముందే లేదంటాడు. ఇంతకు ముందు పాలకులు వేరే పేరు పెట్టారు. దాని పేరు మార్చి ఫోర్ డాష్ కోడ్ అని పెట్టాడు. అది ఈయన పెట్టాడు కాబట్టి తానే దీన్ని తీసుకొచ్చాను అని చెబుతాడు’’.