
బాలానగర్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలో మరోసారి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాయి. ఈ సంఘటన నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాలానగర్ పారిశ్రామికవాడలో హర్ష ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో భవనం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. పై అంతస్థు ఇప్పటికే కూలిపోయిందని కూడా తెలుస్తోంది. గత 3 గంటలుగా 8 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఆ ప్లాస్టిక్ పరిశ్రమలోని మిషన్లు బాగా వేడెక్కడంతో అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. దీంతో పరిశ్రమలో పని చేసే కార్మికులందరూ అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. పరిశ్రమలో అగ్నిప్రమాదంతో భారీగా మంటలు చేలరేగాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.