ఐదు బ్లాకులు.. ఐదు అంతస్తులు
అధునాతనంగా కొత్త సచివాలయం
- సాగర్ తీరంలో లేక్‌వ్యూ డిజైన్
- దసరాకు భూమి పూజ చేయాలని సర్కారు నిర్ణయం
- సచివాలయ పునరుద్ధరణ పనుల నిలిపివేత
- పరిపాలనకు తాత్కాలిక భవనాల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: దసరాకు కొత్త సచివాలయ నిర్మాణానికి భూమి పూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియెట్‌లోని ప్రస్తుత భవనాలను కూల్చేసి అక్కడే కొత్త నిర్మాణం చేపట్టే కసరత్తును వేగవంతం చేసింది. సచివాలయ భవనాల పునరుద్ధరణ పనులేవీ చేపట్టొద్దని, ఇప్పటికే కొనసాగుతున్న పనులను నిలిపేయాలని అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేసింది. నిర్మాణ కాలంలో పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది తలెత్తకుండా సీఎంవో, జీఏడీ సహా సెక్రటేరియెట్‌లోని అన్ని శాఖల కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి సరిపడే తాత్కాలిక భవనాల కోసం వెతుకుతోంది. ఇప్పటికే పలు భవనాలను పరిశీలించిన ప్రభుత్వం.. సీఎం, సీఎంవో, సీఎస్, జీఏడీ కార్యాలయాలను బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో సర్దుబాటు చేయాలని నిశ్చయించింది. మంత్రుల కార్యాలయాలు, మిగతా శాఖల కార్యదర్శుల ఆఫీసులన్నీ సంబంధిత హెచ్‌వోడీలు ఉన్నచోట సర్దుబాటు చేయాలనుకుంటోంది. హెచ్‌వోడీ కార్యాల యాల్లో కుదరకపోతే మైత్రీవనం, గృహకల్ప, ఎంసీహెచ్‌ఆర్‌డీ, ఎక్స్‌పోటెల్‌కు తరలించాలని యోచిస్తోంది. అయితే హెరిటేజ్ కట్టడాల జాబితాలో ఉన్న ‘జీ’ బ్లాక్‌ను కూల్చేసేందుకు ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఐదు బ్లాక్‌లతో కొత్త డిజైన్
హుస్సేన్‌సాగర్‌కు అభిముఖంగా లేక్‌వ్యూ ఎలివేషన్‌తో అధునాతనంగా కొత్త సెక్రటేరియె ట్‌ను నిర్మించాలని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇప్పటికే వివిధ డిజైన్లను తయారు చేయించారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ వీటిని రూపొందించారు. ‘యూ’ ఆకారంలోని డిజైన్‌కు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ఆమో దం తెలిపినట్లు సమాచారం. కొత్త నిర్మాణ సముదాయానికి ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సచివాలయంలో మొత్తం పది బ్లాక్‌లు ఉండగా కొత్తగా నిర్మించే సచివాలయంలో ఐదు బ్లాకు లు మాత్రమే ఉండనున్నాయి. ప్రస్తుతం సీ బ్లాక్ స్థానంలో సీఎంవో బ్లాక్ ఉండనుంది. సీఎం బ్లాక్‌కు ఇరువైపులా రెండు బ్లాక్‌లను నిర్మించనున్నారు. ప్రతి బ్లాక్ కూడా ఐదు అం తస్తులతో ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్‌కు రాకపోకలు సాగించేలా నిర్మితమవనుంది. ఖాళీ స్థలంలో పచ్చదనంతో కళకళలాడేలా ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఫ్లైఓవర్ వైపు షాపింగ్ కాంప్లెక్స్
ప్రస్తుత సచివాలయంలో వాస్తుదోషం ఉందనే కారణంతోనే సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి పట్టుదలతో ఉన్నారు. అందుకే కొత్త నిర్మాణంలో వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత సచివాలయానికి వాస్తు దోషం ఉందని, వీధి పోట్లు కూడా ఉన్నాయనే నిపుణుల సూచనలను పరి గణనలోకి తీసుకొని.. వాస్తుదోష నివారణకు సచివాలయ ప్రధాన ప్రాంగణాన్ని వేరు చేస్తూ కొత్త సముదాయానికి ప్రహరీ గోడ నిర్మించనున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపున ఉన్న ప్రదేశంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
శరవేగంగా సీఎం క్యాంపు ఆఫీస్
మార్చిలో పనులు ప్రారంభమైన సీఎం కొత్త క్యాంపు ఆఫీసును దసరా నాటికి పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ నిర్ణయించింది. దసరా రోజు నుంచే సీఎం కొత్త కార్యాల యం నుంచి పనులు ప్రారంభించేలా నిర్మాణాలను వేగవంతం చేసింది. పక్కనే ఉన్న 34 ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల కూల్చివేత పనులనూ వారం నుంచి ముమ్మరం చేశారు. వీటి స్థానంలో సీఎస్, డీజీపీ, సిటీ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీ, సీఎంవో కార్యదర్శులకు నివాసాలను నిర్మించనున్నారు. వీటితోపాటు ఎర్రమంజిల్‌లో ఐఏఎస్ అధికారులకు వంద క్వార్టర్లను నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారు.