ఊహించని వరదే ముంచింది
- మిడ్‌మానేరు గండిపై సీఎంకు అధికారుల నివేదిక
- 2006-14 మధ్య జరిగిన పనుల జాప్యమూ కారణమని వివరణ
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై అన్ని ప్రధాన ప్రాజెక్టులకు గుండెకాయలాంటి మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు పడిన గండికి ఊహించని వరదే కారణమని నీటిపారుదల శాఖ తేల్చి చెప్పింది. కాల్వల సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో మిడ్‌మానేరు కట్టపై నుంచి వరద పారి వంద మీటర్ల మేర కోతకు గురైందని వెల్లడించింది. 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా నిర్మాణం చేయగా, ప్రస్తుత వరద 2.20 లక్షల క్యూసెక్కుల మేర ఉండటంతో కట్టపై నుంచి నీరు పొంగిందని పేర్కొంది. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నివేదిక అందించారు. కరీంనగర్ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చే లక్ష్యంతో 2006లో రూ.406.48 కోట్లతో మిడ్‌మానేరుకు పాలనా అనుమతులు ఇచ్చారు. 25.87 టీఎంసీల నీటి నిల్వకు వీలుగా ప్రాజెక్టును 309 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించారు. 2009 నాటికి పూర్తి చేసేలా కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు.వివిధ కారణాలతో కాంట్రాక్టర్లు నిర్ణీత సమయానికి పనులు చేయకపోవడంతో 2006 నుంచి 2015 వరకు 4 కాంట్రాక్టు సంస్థలకు పనులు మారుతూ వచ్చాయి. దీంతో 2006-14 మధ్య కేవలం రూ.127 కోట్ల ప్రధాన పనులు జరగ్గా, ఇతర నిర్మాణాల(స్ట్రక్చర్స్) పనులు రూ.570.63 కోట్లు మాత్రమే జరిగాయి. ఇది ప్రాజెక్టు జాప్యానికి కారణమైంది.
దీనికి తోడు ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 13 ముంపు గ్రామాలుండగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు శాశ్వతంగా ముంపునకు గురౌతున్నాయి. ముంపు కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయించి, ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు రూ.311 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత 1,413 గృహాలకు మరో రూ.225.78కోట్ల మేర చెల్లించారు.ఈ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై 2009లో విచారణ జరిపించగా,8 గ్రామాల పరిధిలో రూ.150కోట్ల మేర అక్రమాలు జరిగాయని తేలింది. ఇందులో 24 మంది అధికారుల పాత్రను విజిలెన్స్‌శాఖ గుర్తిం చింది. దీంతో పునరావాస ప్రక్రియ నిలిచిపోయింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పునరావాస ప్రక్రియలో జాప్యంతో పనులు పూర్తి కాలేదు.
దీంతో ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును ప్రాధాన్యంగా తీసుకోవడంతో ఈ రెండేళ్లలో రూ.160 కోట్ల ప్రధాన పనులు జరగ్గా, ఇతర నిర్మాణాల పనులకు రూ.360 కోట్ల మేర ఖర్చు చేశారు. ప్రస్తుత సీజన్‌లో 3 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు. 309 మీటర్ల పూర్తి మట్టానికి గానూ, 305 మీటర్లకు నీటిని నిల్వ చేయాలని భావించారు. కుడి కాల్వ కట్ట 305 మీటర్లు పూర్తయినా ఎడమ కాల్వ కట్ట 304 మీటర్లే పూర్తయింది. దీనికి తోడు 1.50 లక్షల క్యూసెక్కులకు కాల్వల నిర్మాణం ఉండగా, అప్పర్ మానేరులో 29 సెంటీమీటర్ల వర్షం కురవడంతో 2.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో ఎడమ కాల్వ గట్టు పైనుంచి నీరు పొంగడంతో 100మీటర్ల మేర కట్ట దెబ్బతిందని నీటి పారుదల శాఖ అధికారులు సీఎంకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు.