►మూడు రోజుల్లో50 టీఎంసీలు
►45 టీఎంసీల నుంచి 95 టీఎంసీలకు పెరిగిన నీటి నిల్వ
►నాగార్జున సాగర్‌కు 9 వేల క్యూసెక్కులు విడుదల
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులెడుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి నీటి ప్రవాహ జోరు కొనసాగుతోంది. మూడు రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టులోకి సుమారు 50 టీఎంసీల వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో కేవలం 45 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ ఒక్కసారిగా 95 టీఎంసీలకు (ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు) పెరిగింది. ఆదివారం ఉదయం 2,28,189 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో నమోదవగా రాత్రికి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో వరద నీరు వస్తుండటంతో కృష్ణా పుష్కరాల అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద 9,386 క్యూసెక్కుల నీటిని వదులుతోంది.
ఎగువన ప్రవాహాలు తగ్గుముఖం..
ఎగువ కర్ణాటకలో వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లో ప్రవాహాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నాలుగు రోజుల కిందట వరకు 2 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు నమోదవగా ఆదివారానికి అవి 1,62,706 లక్షల క్యూసెక్కులకు తగ్గాయి. అయితే ఆ మొత్తం నీటిని దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఆల్మట్టి వాస్తవ నీటిమట్టం 1,705 అడుగులుకాగా ప్రస్తుతం 1,700 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 129.7 టీఎంసీలకుగాను ప్రస్తుతం 108.08 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మరోవైపు నారాయణపూర్ సైతం పూర్తిగా నిండటంతో ప్రాజెక్టు నుంచి 1,62,466 క్యూసెక్కుల నీటిని దిగువ కు వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన జూరాలకు వస్తోంది. జూరాల సైతం నిండుగా ఉండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలానికి వదులుతున్నారు.
శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు
Published Mon, Aug 8 2016 1:22 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement